చాటింగ్‌తో చీటింగ్‌

19 Mar, 2020 08:07 IST|Sakshi

ఓ యువతి నుంచి రూ.8.5 లక్షలు స్వాహా

మరో ఇద్దరి నుంచి  రూ.50 లక్షల మోసం

కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియా యాప్‌ ఇన్‌స్ట్రాగామ్‌ కేంద్రంగా యువతులను పరిచయం చేసుకుని, వారితో చాటింగ్స్‌ చేస్తూ నమ్మకం సంపాదించుకుని మోసం చేస్తున్న గుర్తుతెలియని ఘరానా మోసగాడిపై సిటీ సైబర్‌ క్రైమ్‌ బుధవారం కేసు నమోదు చేశారు. ఇతడి చాటింగ్స్‌ నమ్మి రూ.8.5 లక్షలు ఇచ్చిన బాధితురాలి ఫిర్యాదు మేరకు దీన్ని రిజిస్టర్‌ చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలోని లోయర్‌ ట్యాంక్‌బండ్‌కు చెందిన ఓ యువతికి ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా హర్షగా చెప్పుకున్న వ్యక్తి పరిచయమయ్యాడు. ఈమెతో కొన్నాళ్ళు స్నేహ పూర్వకంగానే చాటింగ్‌ చేశాడు. ఆపై తనకు అత్యవసరం అంటూ రూ.10 వేల చొప్పున మూడుసార్లు డిపాజిట్‌ చేయించుకున్నాడు. నమ్మకం చూరగొనడం కోసం చెప్పిన సమయాలకు ఆ మొత్తాలు తిరిగి ఇచ్చేశాడు.

ఆపై అసలు కథ ప్రారంభించిన మోసగాడు తాను ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని స్థాపించానని, దానికి సీఈఓగా వ్యవహరిస్తున్నానని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత తనకు రూ.20 కోట్ల విలువైన ప్రాజెక్టు వచ్చిందని నమ్మించాడు. దాన్ని పూర్తి చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటూ నగర యువతి నుంచి రెండు సందర్భాల్లో రూ.8.5 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. అక్కడితో ఆగకుండా మరికొంత మొత్తం కావాలని అతడు కోరుతుండటంతో తన వద్ద లేవంటూ ఆమె చెప్పింది. అయితే తన సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే వారు ఎవరైనా ఉంటే పరిచయం చేయాలని, కేవలం కొన్ని రోజుల్లోనే దాన్ని పూర్తి చేసి వారు పెట్టిన మొత్తానికి రెట్టింపు తిరిగి ఇస్తానంటూ నమ్మబలికాడు. దీంతో ఆ యువతి నగర శివార్లలో ఉండే తన బంధువులు ఇద్దరిని పరిచయం చేసింది. వారినీ ఇన్‌స్ట్రాగామ్‌ చాటింగ్‌ ద్వారా సంప్రదించిన మోసగాడు వారి నుంచీ దాదాపు రూ.50 లక్షలు మేర స్వాహా చేశాడు. ఇతడి చేతిలో మోసపోయిన నగర యువతి బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.    

>
మరిన్ని వార్తలు