ఆయుర్వేద వైద్యుడినంటూ టోకరా  

10 Aug, 2018 14:25 IST|Sakshi
ప్రజలను మోసగిస్తున్న ఆయుర్వేదిక్‌ వైద్యుడు శ్రీనివాసరెడ్డి   

పెంట్లవెల్లి (కొల్లాపూర్‌) : కిడ్నీ వ్యాధికి సంబంధించి ఆయుర్వేద  మందులు ఇస్తానని వచ్చిన ఓ వ్యక్తి టోకరా వేశాడు. ఈ సంఘటన గురువారం మండలంలోని గోప్లాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. నాలుగు రోజుల క్రితం ఆయుర్వేదిక్‌ మందులతో జబ్బులు నయం చేస్తామంటూ కొందరు గ్రామానికి వచ్చి దామోదర్‌రెడ్డి ఇంటికి వచ్చారు. ఆ కుటుంబంలో వరాలు అనే మహిళ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతుండేది. ఆయుర్వేదిక్‌ మందులతో సమస్యను నయం చేస్తానని చెప్పాడు.

మరుసటి రోజు వచ్చి జబ్బు నయం కావాలంటే రూ.12 వేలు ఇవ్వాలని అన్నాడు. ఈ మందులు శ్రీశైలం అడవులు, అచ్చంపేట, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయని చెప్పి, మీకు నమ్మకం లేకపోతే తన ఆధార్‌ కార్డు ఇస్తానని నమ్మబలికాడు. దీంతో బాధితులు రూ.12 వేలు ఇవ్వడంతో సదరు వ్యక్తులు మాయమాటలు చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో బాధితులు పెంట్లవెల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అలాగే చిన్నంబావి, కొప్పునూర్, లక్ష్మిపల్లి గ్రామాలలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని, పోలీసులు వారిని పట్టుకుని శిక్షించాలని కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు