నమ్మించి.. నట్టేట ముంచాడు

19 Jun, 2020 11:49 IST|Sakshi

మహిళను మోసగించి రూ.6 లక్షలతో పరార్‌

పెదగంట్యాడ (గాజువాక) : వ్యాపారంలో నష్టం వచ్చిందనగానే అండగా ఉంటానన్నాడు... ఆర్థికంగా ఆదుకుంటానని నమ్మించాడు. పైపెచ్చు తిరిగి ఆమెకే రూ.10 లక్షలకు ఎసరు పెట్టాడు.. ఆపై తప్పించుకు తిరుగుతున్నాడు.. చివరకు మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెవ్వేటి దివ్యవాణి ఇద్దరు పిల్లలతో సంజీవిగిరి కాలనీలో నివాసం ఉంటోంది. ఆమె భర్త సోనీదత్‌ ఉద్యోగ రీత్యా ముంబయిలో ఉంటున్నాడు. వికాస్‌నగర్‌లో రెండేళ్ల క్రితం ఆమె ఓ పాఠశాలను ప్రారంభించింది. అందులో నష్టాలు రావడంతో ఫైనాన్స్‌ కోసం చూస్తుండగా మోటూరి అప్పలరాజు అలియాస్‌ అఖిల్‌ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు.

ఆర్థికంగా ఆదుకుంటానని, తనకు ఐరన్‌ వ్యాపారం ఉందని, అందులో వాటా ఇస్తానని, బోలెడు లాభాలు వస్తాయని నమ్మించాడు. దీంతో ఆమె తన తండ్రి నుంచి డబ్బులు తీసుకుని అతనికి రూ.6లక్షల వరకూ ఇచ్చింది. అనంతరం ఆమె కారు, సోదరుని ద్విచక్ర వాహనం కూడా ఇచ్చింది. నగదు, వాహనాలతో మోటూరి అప్పలరాజు వుడాయించాడు. తర్వాత ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని రావడంతోపాటు అతను కనిపించకపోవడంతో మోసపోయానని గ్రహించిన దివ్యవాణి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడు. సీఐ పైడపునాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు