మ్యాట్రిమొని వెబ్‌సైట్‌లో చూసి

9 Jul, 2019 08:33 IST|Sakshi

రూ. 24 లక్షలు నొక్కేసిన వంచకుడు

మోసపోయిన మహిళా టెక్కీ

కర్ణాటక, బనశంకరి:‘హలో నేను  మీ కులం వాడినే. మాది మీ ఊరే. మనిద్దరం పెళ్లి చేసుకుంటే చక్కని జంట అవుతాం’అని  నమ్మించి ప్రముఖ సాప్ట్‌వేర్‌ కంపెనీ మహిళా ఐటీ ఇంజనీరుకు రూ.24 లక్షలు బురిడీ వేసిన సంఘటన  నగరంలో వెలుగుచూసింది.  బాధితురాలు న్యాయంకోసం వనితా సహాయవాణిని ఆశ్రయించింది. 

మ్యాట్రిమొని వెబ్‌సైట్‌లో చూసి  
వివరాలు..  ఉత్తరకన్నడ జిల్లాకు చెందిన యువతి ఎలక్ట్రానిక్‌ సిటీలో ఉన్న ప్రముఖ సాప్ట్‌వేర్‌ కంపెనీలో టెక్కీ.  ఆమె వివాహ సంబంధాల కోసం తన వివరాలను ఒక మ్యాట్రిమొని వెబ్‌సైట్‌లో నమోదు చేయగా, 28 ఏళ్ల యువకుడు పరిచయం అయ్యాడు. వైట్‌ఫీల్డ్‌లో ఉన్న ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగి అని పరిచయం చేసుకున్నాడు. తరచూ ఫోన్లో మాట్లాడుతూ మీ మాట తీరు, ప్రవర్తన ఎంతో నచ్చిందని, తాను కూడా ఉత్తర కన్నడ జిల్లాకు చెందినవాడినే మీ కులానికి చెందిన వాడినేనని ఆమెను బుట్టలో వేసుకున్నాడు. తరచూ ఫోన్లో మాట్లాడడం, కలవడం చేసేవాడు. మన భవిష్యత్‌ కోసం ఒక ప్లాట్‌ చూశానని, కొంచెం డబ్బు తక్కువగా ఉంది అని చెప్పి ఆమె నుంచి రూ.2 లక్షలు తీసుకున్నాడు.  అలా 13 సార్లు యువతి నుంచి డబ్బు లాగేశాడు. అనంతరం మార్కెట్‌లోకి  కొత్తకారు వచ్చిందంటూ దాని కొనుగోలు కోసం ఆమె నుంచి డబ్బు తీసుకున్నాడు. యువతి పేరుతో క్రెడిట్‌కార్డు కూడా తీసుకుని ఇష్టానుసారం కొనుగోళ్లు చేశాడు. ఇలా మొత్తం రూ.24 లక్షలను ఆమె నుంచి దోచుకున్నాడు. 

డబ్బు లేదనడంతో..   
 మే నెలలో యువతి తన వద్ద ఇక డబ్బు లేదని, ఇవ్వలేనని చెప్పడంతో అప్పటి నుంచి మోసగాడు ముఖం చాటేశాడు. యువతి ఫోన్‌ చేస్తే తప్పించుకుని తిరగాడు. ఇతడి ప్రవర్తన పట్ల అమానంతో అతని ఫేస్‌బుక్‌ ఖాతాలోని స్నేహితున్ని విచారించగా ఇతనికి గతంలోనే పెళ్లయినట్లు తెలిసింది.దీంతో బాధిత యువతి మహిళా సహాయవాణికి ఫిర్యాదు చేసింది. సహాయవాణి చీప్‌ రాణిశెట్టి, మోసగానికి ఫోన్‌ చేసి కౌన్సిలింగ్‌ కు రావాలని చెప్పారు. వస్తానని తెలిపిన వంచకుడు నెలరోజులు గడిచినా ఇంకా రాలేదు. ఇతడిని అరెస్ట్‌ చేసి చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు రాణిశెట్టి సూచించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు