ఖాకీల వేధింపులతో బలవన్మరణం

3 Sep, 2019 12:21 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

భోపాల్‌ : పోలీసుల వేధింపులతో 55 సంవత్సరాల వ్యక్తి తన ఇంటి సమీపంలోని చెట్టుకు వేలాడి విగతజీవిగా మారిన ఘటన మధ్యప్రదేశ్‌లో సోమవారం వెలుగుచూసింది. అలీరాజ్‌పూర్‌ జిల్లాలోని బయదియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృశ్యమైన తన కుమారుడి గురించి సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఆయనను వేధింపులకు గురిచేయడంతో బాధిత వ్యక్తి భూర్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు పోలీసులు వెంబడించడంతోనే తమ కుమారుడు మరణించాడని అంతకుముందు భూర్‌ సింగ్‌ పోలీసులపై ఆరోపణలు చేయడం గమనార్హం. కాగా ఈనెల 22న మద్యం షాపులో చోరీ చేశాడనే ఆరోపణలపై భూర్‌ సింగ్‌ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన కుమారుడు ధీరేంద్రను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, ధీరేంద్ర పారిపోతూ నదిలో దూకేశాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ధీరజ్‌ మృతికి బాధ్యులైన అధికారులపై కేసు పెట్టాల్సిన పోలీసులు ధీరేంద్రను తాము దాచామని చెబుతూ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని భుర్‌ సింగ్‌ బంధువు మాన్‌ సింగ్‌ ఆరోపించారు. పోలీసుల వేధింపులు తాళలేకే భూర్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తూ ఆయన బంధువులు స్ధానిక పోలీస్‌ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు.

మరిన్ని వార్తలు