ప్రేమ వివాహం: జీవితంపై విరక్తితో ఆత్మహత్య

7 Nov, 2019 08:44 IST|Sakshi
మృతిచెందిన మహ్మద్‌ బాబా యూసఫ్‌ ఉద్దీన్‌

భర్త మృతితో రోదిస్తున్న నిండు గర్భిణి  

పెద్దదిక్కు మరణంతో అనాథైన కుటుంబం

సాక్షి, మదనపల్లె: ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యుల నుంచి హాని ఉందని హైదరాబాద్‌ వదలి మదనపల్లెకు వచ్చారు. లెక్చరర్‌గా ఒకరు, బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిగా ఇంకొకరు పనిచేస్తూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో తిరిగి వచ్చేయాలని తల్లిదండ్రుల నుంచి అతడిపై ఒత్తిడి పెరగడంతో రెండు రోజులుగా అతడు మదనపడుతున్నాడు. జీవితంపై విరక్తిచెంది బుధవారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మదనపల్లె గొట్టిగానిచెరువులో ఈ సంఘటన జరిగింది.

రూరల్‌ పోలీసుల కథనం మేరకు హైదరాబాద్‌లోని టోరీ చౌక్‌కు చెందిన ఖజామయినుదీ్దన్‌ కుమారుడు ఎం.డీ మహ్మద్‌ బాబా యూసఫ్‌ ఉద్దీన్‌(32) హెచ్‌సీయూ యూనివర్సిటీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. కర్నూలుకు చెందిన ఆయిషా(30) అదే కళాశాలలో పీజీ చదువుతుండగా అతనికి పరిచయమైంది. అప్పటికే ఆమెకు పెళ్లయి 12 సంవత్సరాల ఇత్రి అనే కుమార్తె ఉంది. అయితే మొదటి భర్తతో విడాకులు తీసుకున్న ఆయిషా గురించి తెలుసుకున్న యూసఫ్‌ తాను ఇష్టపడుతున్నానని ఆమె వెంటపడ్డాడు. ఏడాది క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకున్నాడు. ఈ క్రమంలో రెండు కుటుంబాల సభ్యుల నుంచి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వదిలి మదనపల్లె చేరుకున్నారు. కొత్తపల్లె పంచాయతీ, కొత్తఇండ్లులోని గొట్టిగానిచెరువులో ఓ అద్దె ఇంటిలో ఉంటున్నారు.

స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఉర్దూ లెక్చరర్‌గా ఆమె పనిచేస్తుండగా, అతడు ఓ బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇత్రిని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదివిస్తున్నారు. ప్రస్తుతం ఆయిషా నిండు గర్భవతి. అయితే రెండు రోజులుగా భర్త మదనపడుతుండడంతో పలుమార్లు ఏం జరిగిందని నిలదీసింది. అయినా అతని నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇంటికి వచ్చేయాలని యూసఫ్‌ తల్లిదండ్రులు పట్టుబట్టడంతో గర్భంతో ఉన్న భార్యను వదలి వెళ్లలేక తనువు చాలించాలనుకున్నాడు. ఇంట్లో పడక గదిలోని పైకప్పునకు ప్లాస్లిక్‌ తాడుతో ఉరేసుకున్నాడు. భార్యాబిడ్డలు గుర్తించేలోపే అతడు మృతిచెందాడు. భార్యాపిల్లల రోదనలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని విషయాన్ని రూరల్‌ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ హరిహరప్రసాద్‌కు తెలియజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా