టీడీపీ నేతల దాష్టీకానికి వ్యక్తి బలి

25 Jan, 2018 08:20 IST|Sakshi

ఎదుగుతున్న పిల్లలు.. ఎదురీదుతున్న జీవనం. కాళ్లావేళ్లా పడగా దయ ఉన్న మారాజు (అధికారి) ప్రభుత్వం తరఫున కాస్త జాగా చూపాడు. గూడు కట్టుకోవాలనే సంకల్పంతో కూడు మానుకుని, ఆకలి పేగులను కన్నీటితో చల్లార్చాడు. కండలు కరిగించగా వచ్చిన కాసులను కొద్దికొద్దిగా కూడబెట్టుకున్నాడు. సర్కారోళ్ళు ఇచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణానికి పునాది వేశాడు. ఇంతలో నాలుగు దిక్కులు నుంచి అధికార పార్టీ నాయకులు రాబందుల్లా వచ్చి పడ్డారు. ఆ నిరుపేద ఇంటిని పునాదులతో పెకిలించారు. ఇదెక్కడి దారుణమయ్యా..? అని ఘొల్లుమంటే కుళ్లబొడిచారు. ఇక తన గోడు వినే దిక్కులేక, గూడు కట్టుకునే దారుల్లేక.. తన శవంపైనైనా ఇల్లు కట్టండంటూ పెట్రోల్‌ పోసుకున్నాడు. భార్యాబిడ్డల రోదనలు మిన్నంటుతుండగా నిలువునా కాలిపోయాడు. సొంతింటి కలను చిదిమేసిన టీడీపీ నేతల దాష్టీకానికి చివరకు సమాధిగా మారిపోయాడు ములకలచెరువు మండలం దేవులచెరువు గ్రామానికి చెందిన రెడ్డప్ప ఆచారి..

మదనపల్లె టౌన్‌: అధికార పార్టీ నేతల దాష్టీకానికి గురై మనస్తాపంతో పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న రెడ్డప్ప ఆచారి (45) వారం పాటు మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో మృత్యువుతో పోరాడి బుధవారం రాత్రి తనువు చలించాడు. వివరాల్లోకెళ్తే.. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం దేవలచెరువుకు చెందిన కంసల చెంచన్న కుమారుడు రెడ్డప్ప ఆచారి కొలిమిలో పని చేస్తూ భార్య శ్రీదేవి, పిల్లలు మల్లిక, తిరుమలేశు, అనుష్కను పోషించుకుంటున్నాడు. ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా భూమిలో ఇంటి నిర్మాణ పనులు చేపట్టాడు. ఆ స్థలంపై కన్నేసిన టీడీపీకి చెందిన సంఘమిత్ర లక్ష్మీదేవి, బసివోళ్ల చంద్ర మరో 10 మంది నిర్మాణ పనులు అడ్డుకున్నారు. వారికి ఆ గ్రామ టీడీపీ సర్పంచ్‌ శ్రీనివాసులు, ఆయన బావమరిది వత్తాసు పలికారు. దీనికితోడు çసర్పంచ్, గ్రామస్తులతోపాటు పోలీసుల నుంచి కూడా బెదిరింపులు అధికమయ్యాయి.  

ఈ నెల 18న ఇంటి ముందు పునాదిరాళ్లను సరిచేస్తుండగా మళ్లీ బసివోళ్ల చంద్ర, సంఘమిత్ర లక్ష్మీదేవి అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆచారి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే కుటుంబీకులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించాడు. ఇంటి యజమాని మృతితో ఆ కుటుంబం వీధిన పడింది. బాధితుడు చనిపోయాకా కూడా తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు కేసే నమోదు చేయలేదు. ఎస్‌ఐ ఈశ్వర్‌ను వివరణ కోరగా ఘటన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. బాధితులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదుచేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు