ఎడబాటు భరించలేక వ్యక్తి ఆత్మహత్య!

9 Nov, 2018 07:21 IST|Sakshi
తండ్రిని కోల్పొయి అనాధులయిన చిన్నారులు కార్తికేయ గణేష్, చాణుక్య ఆచంట రాజేష్‌ (పాత చిత్రం)

తూర్పుగోదావరి , తుని రూరల్‌: మండలంలోని ఎస్‌.అన్నవరం శివారు కొత్తసూరవరం (శాంతినగర్‌)లో నివాస గృహంలో ఆచంట రాజేష్‌ (32) ఉరి వేసుకుని మృతి చెందినట్టు రూరల్‌ ఎస్సై కె.సుధాకర్‌ గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొద్ది రోజులుగా ఒంటరిగా ఉంటున్న రాజేష్‌ ఈ నెల రెండో తేదీన సోదరుడి బియ్యం దుకాణానికి వెళ్లాడు. సోదరుడు లేకపోవడంతో తిరిగివచ్చేశాడు. శనివారం ఉదయం నుంచి ఎవరికీ అందుబాటులో లేడు. అదే రోజు ఇంట్లో శ్లాబ్‌కు ఉన్న ఇనుప కొక్కేనికి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదారు రోజులు కావడంతో మృతదేహం పూర్తిగా చెడిపోయి దుర్వాసన వస్తుండడాన్ని స్థానికులు గమనించి సమాచారం ఇచ్చారన్నారు. ఏడాదిన్నరగా భార్య శ్రీదేవి, కార్తికేయ గణేష్‌ (3), చాణుక్య (1) అనే ఇద్దరు పిల్లలతో అమ్మగారి ఇంటివద్ద ఉంటోంది. ఈ కారణంగానే రాజేష్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్వాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఎడబాటే కారణమా?
తుని పట్టణం చినపండా వీధికి చెందిన రాజేష్‌కు శంఖవరం గ్రామానికి చెందిన శ్రీదేవితో 2013లో వివాహమైంది. వీరిద్దరికి ఏడాదిలోనే మొదట బిడ్డ కార్తికేయ గణేష్‌ జన్మించాడు. కుటుంబ తగాదాలతో రాజేష్, శ్రీదేవి కొత్త సూరవరం  శాంతినగర్‌ కాలనీలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. తర్వాత శ్రీదేవి రెండోసారి గర్భవతి కావడంతో నాలుగో నెలలో శంఖవరంలో పుట్టింటికి వెళ్లింది. రెండో కాన్పులో మగబిడ్డ జన్మించాడు. ఆ విషయాన్ని రాజేష్‌కు తెలియజేయలేదు. ఏడాది గడుస్తున్నా భార్య, పిల్లలు తన వద్దకు రాలేదన్న మనోవేదన, ఎడబాటు భరించలేక రాజేష్‌ ఆత్మహత్యకుపాల్పడినట్టు తెలుస్తోంది.

అనాథలైన చిన్నారులు
అమ్మానాన్నల ఒడిలో ఆడుకునే వయస్సులో ఆ చిన్నారులు తండ్రి లేని అనాథలయ్యారు. తండ్రి చనిపోయిన విషయం తెలియని ఆ చిన్నారులు అక్కడికి వచ్చిన జనాలను చూసి తాతయ్య సత్యనారాయణ వద్ద బిక్కుబిక్కుమంటూ ఉండడం స్థానికులను కంటతడి పెట్టించింది. రాజేష్‌ మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. 

మరిన్ని వార్తలు