బిజినెస్‌కు తల్లిదండ్రులు డబ్బులివ్వలేదని..

30 Jan, 2020 10:31 IST|Sakshi
భరత్‌రెడ్డి మృతదేహం

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

మొయినాబాద్‌ మండలం వీరన్నపేట వద్ద ఘటన

మృతుడు రేగడి ఘనాపూర్‌వాసి

సాక్షి, మొయినాబాద్‌ : సొంతంగా బిజినెస్‌ ఏర్పాటుకోసం తల్లిదండ్రులను డబ్బులు అడిగితే ఇవ్వలేదనే మనస్తాపంతో ఓ యువకుడు  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వీరన్నపేట సమీపంలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం రేగడి ఘనాపూర్‌ గ్రామానికి చెందిన కంఠం వెంకట్‌రెడ్డి కుమారుడు భరత్‌రెడ్డి (28) గత 8 సంవత్సరాలుగా నగరంలోని లంగర్‌హౌస్‌లో ఉంటూ ప్రైవేటు జాబ్‌ చేసేవాడు. సొంతంగా బిజినెస్‌ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో భరత్‌రెడ్డి నెల రోజుల క్రితం జాబ్‌ మానేశాడు. బిజినెస్‌ ఏర్పాటుకు అవసరమైన డబ్బులు ఇవ్వాలని నాలుగు రోజుల క్రితం రేగడి ఘనాపూర్‌కు వెళ్లి తల్లిదండ్రులను అడిగాడు. ఇప్పుడు డబ్బులు లేవని.. పంటలు అమ్మిన తరువాత డబ్బులు ఇస్తామని తల్లిదండ్రులు చెప్పారు. ఇప్పుడే అత్యవసరంగా డబ్బులు కావాలని గట్టిగా అడగడంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన భరత్‌రెడ్డి ఇంటి నుంచి లంగర్‌హౌస్‌ రూంకు వెళ్లిపోయాడు. (నాడు అన్న.. నేడు తమ్ముడు )

స్నేహితులకు మెసేజ్‌ పంపి..
భరత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం పురుగుల మందు తీసుకుని లంగర్‌హౌస్‌ నుంచి మొయినాబాద్‌ మండలం వీరన్నపేట సమీపంలోకి బైక్‌పై వచ్చాడు. అక్కడి నుంచి లంగర్‌హౌస్‌లో ఉన్న తన స్నేహితులకు సాయంత్రం 6 గంటల సమయంలో ఒక మెసేజ్‌ పంపాడు. బిజినెస్‌ ప్రారంభించేందుకు తనకు ఎవరూ డబ్బులు ఇవ్వడంలేదని.. అందుకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్‌ పెట్టాడు. దీంతో స్నేహితులు 100కు డయల్‌ చేసి సమాచారం ఇచ్చారు. డయల్‌ 100 నుంచి లంగర్‌హౌస్‌ పోలీసులకు సమాచారం వచ్చింది. భరత్‌రెడ్డి మొబైల్‌ నంబర్‌ లొకేషన్‌ను పరిశీలించిన పోలీసులు మొబైల్‌ లొకేషన్‌ మొయినాబాద్‌ మండలం వీరన్నపేట సమీపంలో ఉన్నట్లు చూపించడంతో లంగర్‌హౌస్, మొయినాబాద్‌ పోలీసులు ఆ ప్రాంతంలో వెతికారు. అప్పటికే చీకటి పడటంతో భరత్‌రెడ్డి ఆచూకీ లభించలేదు.(ప్రియురాలిపై సామూహిక లైంగికదాడికి యత్నందొరకలేదు.)

బుధవారం ఉదయం వీరన్నపేట సమీపంలో గ్రామస్తులకు భరత్‌రెడ్డి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద పురుగుల మందు డబ్బా పడి ఉండటాన్ని గమనించారు. సంఘటనా స్థలంలో వివరాలు సేకరించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు