ఫైనాన్స్‌ వారు బైక్‌ తీసుకెళ్లారని..

23 Jun, 2020 12:39 IST|Sakshi

ఓర్వకల్లు: సకాలంలో కంతులు చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ వారు బైక్‌ తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని సోమయాజులపల్లెలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పి.మద్దిలేటి (40) వ్యవసాయ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏడాది క్రితం బేతంచెర్ల పట్టణంలోని హీరో కంపెనీ షోరూంలో ఫైనాన్స్‌లో బైక్‌ను కొనుగోలు చేశాడు. ప్రతి నెలా రూ.3 వేల చొప్పున కంతులు చెల్లించాల్సివుంది.

కరోనా సమయంలో లాక్‌డౌన్‌ విధించడంతో వ్యవసాయ పనులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యాడు. ఈ క్రమంలో రెండు నెలల కంతులు చెల్లించలేకపోయాడు. ఫైనాన్స్‌ కంపెనీ ఏజెంట్‌ వారం క్రితం కంతులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో కుటుంబ సభ్యులు రూ.6 వేలు మద్దిలేటికి ఇచ్చారు. ఆ సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు. మూడు రోజుల క్రితం కంపెనీ ఏజెంట్‌ బైక్‌ను తీసుకెళ్లాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన మద్దిలేటి ఆదివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.   

మరిన్ని వార్తలు