హృదయం బద్దలైంది  

22 May, 2018 10:06 IST|Sakshi

భార్య వదిలేసిందని ఉరేసుకుని భర్త ఆత్మహత్య

పెళ్లయిన 20 రోజులకే దంపతుల మధ్య మనస్పర్థలు

కులాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతీయువకులు

ఇబ్రహీంపట్నంరూరల్‌ : స్నేహం ప్రేమగా మారింది. కులాలు వేరైనా మనసులు కలిశాయి. పెళ్లి చేసుకున్నారు. హాయిగా గడపాల్సింది పోయి మూణ్నాళ్లకే మనస్పర్థలతో దంపతులిద్దరూ విడిపోయారు. భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.

వివరాలు ఆదిబట్ల ఎస్సై మోహన్‌రెడ్డి కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన చదలవాడ జయరాజ్‌ దంపతులు వారి ఇద్దరి కుమారులతో కలిసి గత 40 సంవత్సరాలుగా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పరిధిలోని తుర్కయంజాల్‌లో నివాసం ఉంటున్నారు. జయరాజ్‌ కుమారుడు రాజేష్‌ ఆదిబట్ల టాటాసీకోర్‌స్కై కంపెనీలో క్యాజువల్‌ ఉద్యోగిగా విధులు నిర్వర్తింస్తుండేవాడు.

రాజేష్‌ గత కొంతకాలంగా తుర్కయంజాల్‌ గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. 40 రోజుల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నాడు. ప్రేమ పెళ్లి చేసుకున్నాక తల్లిదండ్రులతో నివాసం ఉండకుండా కమ్మగూడ గ్రామంలో అద్దెకుంటున్నారు. వివాహం అయిన 20 రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి.. రాజేష్‌ను వదిలి వెళ్లింది.

దీంతో అప్పటి నుంచి కాపురానికి రావడం లేదని రాజేష్‌ మనోవేదనకు గురయ్యాడు.సోమవారం ఉదయం అద్దెకుంటున్న ఇంట్లోనే ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి జయరాజ్‌ తలుపు పగుగగొట్టి లోపలకు వెళ్లి చూడగా రాజేష్‌ ఫ్యాన్‌కు అచేతనంగా వేలాడుతూ కనిపించాడు.

మరో కొడుకు రాకేష్‌ సహాయంతో రాజేష్‌(21)ను కిందకు దింపి పరిశీలించగా అప్పటికే మరణించినట్లు గుర్తించారు. ఆదిబట్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. రాజేష్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ప్రకాశం జిల్లా కనిగిరికి తరలించినట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు