ఏ పన్జేసినా బతికేటోనివి కద బిడ్డా..!

30 Jun, 2018 12:19 IST|Sakshi
సామల వెంకటేశ్‌ మృతదేహం 

యజమాని పనిలోంచి తీసేశాడని మనస్తాపం

తల్లడిల్లిన తల్లి హృదయం

‘ఏం ఫికరు పడకు బిడ్డ.. ఈ పని కాకపోతే ఇంకో పని.. ఎట్లైనా బతుకుతవ్‌.. ధైన్యంతోటి ఉండు’ అని ఉద్యోగం కోల్పోయిన యువకుడికి తల్లి ధైర్యం చెప్పింది. కానీ మనస్థాపం చెందిన ఆ యువకుడు మాత్రం  తల్లికి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోయాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోయినా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది ఆ తల్లి.. ఇప్పుడు తనను విడిచి వెళ్లడంతో దుఃఖ సాగరంలో మునిగిపోయింది.

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌) : హాజీపూర్‌ మండలం నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన సామల వెంకటేశ్‌(21) శుక్రవారం యజమాని పని నుంచ ?తీసేశాడని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్‌ డిగ్రీ పూర్తి చేశాడు. ఉపాధి కోసం ఆరు నెలల క్రితం హైదరాబాద్‌ వెళ్లాడు. అక్కడ ఓ స్టూడియోలో ఫొటో, వీడియో మిక్సింగ్‌ పని నేర్చుకుంటున్నాడు. ఈక్రమంలో ఈ నెల 25న స్వగ్రామం నర్సింగాపూర్‌కు వచ్చాడు.

వచ్చిన రోజు నుంచి వెంకటేశ్‌ దిగాలుగా ఉండడం చూసిన తల్లి తిరుపతమ్మ కొడుకును విషయం అడిగింది. తాను తీసిన ఫొటోలు బాగా రాలేదని, యజమాని పనికి రావొద్దని చెప్పాడని వెంకటేశ్‌ తల్లితో చెప్పాడు. ‘ఏం బాధపడొద్దు.. ఇక్కడే ఉండి వేరే పనులేమైనా చేసుకోవచ్చు’ అని వెంకటేశ్‌కు తల్లి ధైర్యాన్ని నూరిపోసింది. అనంతరం శుక్రవారం ఉదయం తన తల్లిని ఈజీఎస్‌ పని వద్ద బైక్‌పై దింపి వచ్చాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరేసుకున్నాడు. వెంకటేశ్‌ తండ్రి రాయమల్లు చిన్నప్పుడే చనిపోగా తల్లి కష్టపడి పెంచింది. మృతుడికి ఒక సోదరి కాగా వివాహం కూడా అయ్యింది. తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.శ్రీనివాస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు