కొడుకా.. రమేశా!

6 Mar, 2019 15:25 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

జీవితంపై విరక్తితో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య!

నోస్‌ క్యాన్సరే కారణమా?

జోగిపేటలో విషాదఛాయలు 

సాక్షి, జోగిపేట(అందోల్‌): చేతికి ఎదిగివచ్చిన కొడుకు.. రాత్రి పడుకొని ఉదయం లేచి చూసే సరికి శవంగా మారడంతో ఆ తల్లి గుండె తల్లడిల్లింది..  ఎంత పనిచేసావు కొడుకా రమేశు అంటూ గుండలవిసేలా రోదించింది. జీవితంపై విరక్తితో మంగళవారం యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న  సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. జోగిపేట పట్టణానికి చెందిన బీర్ల రమేశ్‌ (26) బీఈడీ పూర్తిచేసిన ఎస్సై, లేదా కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కొన్ని రోజులుగా సంగారెడ్డిలోనే స్నేహితులతో ఉండి వారితో పాటు సాధన చేస్తున్నాడు. శివరాత్రి పండుగకోసం జోగిపేటకు వచ్చిన ఆ యువకుడు సోమవారం తన ఇంటిలోని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు.

ఉదయం లేచి చూడగానే రమేష్‌ కనిపించకపోయే సరికి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఎక్కడకు వెళ్లాడోనని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. సోదరుడు అనిల్‌ మండలం పరిధిలోని మాసానిపల్లి శివారులోని తమ వ్యవసాయ భూమి వద్దకు వెళ్లగానే అక్కడ రమేష్‌ చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతుండడాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమచారం ఇచ్చారు. కాలనీవాసులు, మిత్రులు, బంధువులు, అక్కడి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వెంకటేశ్‌ వచ్చి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోదరుడు అనిల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ముక్కు క్యాన్సరే కారణమా..?
సోమవారం అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత తన సెల్‌ఫోన్‌లోని స్టేటస్‌లో నోస్‌ క్యాన్సర్‌ అని ముక్కు ఫొటోను పోస్టు చేసారు. కొంత మంది స్నేహితులు ఆ స్టేటస్‌ను చూసి పొద్దున మాట్లాడదామని ఊరుకున్నారు. ఉదయం లేచే సరికి ఈ సంఘటన తెలియడంతో స్నేహితులంతా ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. మూడేళ్ల నుంచి ముక్కుకు సంబంధించి వ్యాధితో బాధ పడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అది క్యాన్సర్‌ అని మాత్రం చెప్పలేదన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి ఒక్కసారిగా శవంగా మారడంతో కాలనీలో విషాధచాయలు అలుముకున్నాయి.

రమేశ్‌ (ఫైల్‌)  

మరిన్ని వార్తలు