విషాదం: భార్యతో బ్రేకప్‌.. లైవ్లో పాముకాటుతో..

27 Sep, 2017 17:52 IST|Sakshi

మాస్కో: ప్రేమించిన భార్య వదిలేసి వెళితే ఎవరికైనా బాధే. యవ్వనంలో ఉంటే ఆ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి బాధను తట్టుకోవడం అందరి వల్లా కాదు. బాధతో తల్లడిల్లుతూ జీవితాంతం కుంగిపోతూ కృషించిపోయే వాళ్లు కొందరైతే, జీవితానికి ఎదురీది భార్యకన్నా బతుకు ముఖ్యమనుకొని జీవితంలో మరింతగా రాణించేవారు మరికొందరు. భార్యలేని జీవితం తనకెందుకని అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకునే పిరికివారు కూడా ఉంటారు.

కానీ రష్యాలోని పీటర్స్బర్గ్కు చెందిన 31 ఏళ్ల ఆర్సే వలీవ్ ఈ కోవల్లో దేనికి చెందిన వాడు కాదు. 20 ఏళ్లుగా భయంకర విషపూరిత పాములతోని, మనుషులను తినే అడవి పిల్లులతోని ఆడుకునే వాడు. వాటి పట్ల ఉన్న ప్రేమతోనే ఆయన కొంతకాలం జంతుప్రదర్శన శాలలో పనిచేశాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి యూట్యూబ్లో పలు ఛానళ్ల నిర్వహించడం ద్వారా లక్షలాది అభిమానులను కూడగట్టుకున్నాడు. ఆయనకు భార్య ఏక్తరీనా కాత్యా అంటే కూడా చాలా ఇష్టమే. ఇద్దరూ యూట్యూబ్ ఛానళ్లలో తమ పెంపుడు పాములు, పిల్లులతో కనిపిస్తూ అల్లరిచేసే వారు. పాములతో ఆడుకోవడమూ, వాటికి సంబంధించిన విశేషాలు చెప్పడం ఇద్దరికీ ఇష్టమే. వారి మధ్య ఈ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.

భార్య తనతో సరిగ్గా ఉండడం లేదని, అందుకు మరో వ్యక్తితో ప్రేమాయణం సాగించడమే కారణమని వలీవ్కు అనుమానం వచ్చింది. ఆగస్టు 4వ తేదీన భార్య తలపై కొట్టాడు. ఆమె అప్పుడు స్పహతప్పి పడిపోయింది. జూలై నుంచి తమ మధ్య సెక్స్ లేదని, అందుకు కారణం ఆమె తనను పట్టించుకోకపోవడమే కారణమని వలీవ్ కెమేరా లైవ్లో తన బాధను పంచుకున్నారు. భార్యను కొట్టినందుకు సెప్టెంబర్ 21వ తేదీన ప్రజాముఖంగా క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. అయినప్పటికీ భార్యతో ఆయనకు సఖ్యత కుదరలేదు.

ఇటీవల ఓ రోజున తనకు అత్యంత ఇష్టమైన ‘బ్లాక్ మాంబ’తో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చూపిస్తానని చెప్పాడు. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బ్లాక్ మాంబ. అది కరిస్తే కొన్ని నిమిషాల్లోనే మనిషి చనిపోతాడు. ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించిన మరుసటి రోజే వలీవ్ కెమేరా ముందుకు వచ్చి. తాను తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని, తెల్లారే నిద్ర లేచేసరికి పక్కన ఎవరూ లేకపోవడం ఎంతో వెలితిగా ఉందని అన్నారు. ఇలాంటి జీవితం అవసరమా ? అని ప్రేక్షకులను ప్రశ్నించారు. ఒక్క క్షణం అంటూ కెమేరా నుంచి పక్కకు వెళ్లాడు.

కాసేపటికీ మత్తుగా ఉన్న కళ్లతో కెమేరా ముందుకు వచ్చాడు. ‘ఇదిగో చూడండి! నా కిష్టమైన బ్లాక్ మాంబతో కరిపించుకున్నా’ అని చెప్పాడు. ఆయన వేళ్లపైన పాము కరచినట్లు రెండు రక్తం చుక్కలు కనిపించాయి. ఇంతలో ఆయన కళ్లు మూసుకుపోతుండగా అటూఇటూ తూగుతూ మత్తుగా మాట్లాడాడు. చివరి నిమిషంలో తనకు భార్యను చూడాలని ఉందని, ఎవరైనా తన భార్యకు ఫోన్చేసి పరిస్థితి చెప్పండంటూ ఆమె మొబైల్ ఫోన్ నెంబర్ బయటకు చదివారు. ఆ తర్వాత లేచి బాత్రూమ్ వైపు వెళుతూ కనిపించాడు. కాసేపటికి కెమేరా ఆగిపోయింది. వలీవ్ బాత్రూమ్లోకి కాకుండా ఇంటిముందుకు వెళ్లి తనను కాపాడాల్సిందిగా బాటసారులను కోరారట. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న వారిలో కొందరు సమీపంలోని ఆస్పత్రికి ఫోన్లు చేయడంతో అంబులెన్స్ వచ్చి వలీవ్ను ఎక్కించుకొని వెళ్లిందట. ఆస్పత్రికి వెళ్లేలోగానే వలీవ్ కన్నుమూశాడు. ఆయన భార్య కాత్య ఈ వీడియోను చూసిందీ లేనిదీ తెలియదు. ఎలా స్పందించారో కూడా తెలియదు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా