క్షణికావేశం... మిగిల్చిన విషాదం

18 Oct, 2019 09:49 IST|Sakshi
రోదిస్తున్న భార్య సరస్వతి, (ఇన్‌సెట్‌లో) మృతుడు జానకీరావు

పనస కొమ్మలు కోస్తున్నందుకు వ్యక్తిపై దాడి

ఆపై ఆస్పత్రికి తరలించగా మృతి

 మాకన్నపల్లిలో ఘటన 

పలాస: చిన్న విషయమై తలెత్తిన గొడవ ఇద్దరి వ్యక్తుల మధ్య కొట్లాటకు దారి తీసింది. ఆపై క్షణికావేశం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. తెల్లారేసరికి ఒకరి ముఖం ఒకరు చూసుకుని, కలిసిమెలసి ఉండాల్సిన చోట విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో పలాస మండలం మాకన్నపల్లి గ్రామానికి చెందిన కుత్తుం జానకీరావు(63) గురువారం ఉదయం మృతి చెందా డు. గ్రామానికి బత్తిన దమయంతమ్మ తోటలో ఒక పనస చెట్టు ఉంది. అది గతేడాది తిత్లీ తుపానుకు పూర్తిగా విరిగిపోయింది. మరలా ఆ చెట్టుకు చిగుర్లు తొడిగి చిన్న కొమ్మలు ఏర్పడ్డాయి. అండమానులో ఉంటున్న ఈమెకు మృతుడు జానకీరావు పనస చెట్టు కొమ్మలను మేకల కోసం కోసుకుంటానని కోరాడు. అందుకామె సరేనంది. దీంతో గురువారం ఉదయం పనస చెట్టు వద్దకు వెళ్లి కొమ్మలు కోస్తున్నాడు.

ఇదేక్రమంలో అదే గ్రామానికి చెందిన సైని నారాయణ వెళ్లి ప్రశ్నించాడు. దమయంతమ్మ కోసుకోమని చెప్పిందని అంటుండగానే... కోప్రోదిక్తుడైన నారాయణ ఆ చెట్టును తనకిచ్చిందని చేతితో పిడిగుద్దులు గుద్దాడు. ఆ ధాటికి తట్టుకోలేక ఆయన నేలపై పడిపోయాడు. అంతటి ఆగకుండా తన కాలితో గుండెపై తన్నాడు. వీరువురి కొట్లాటను గమనించిన గ్రామస్తులు అక్కడకు చేరుకుని సర్దిచెప్పారు. వెంటనే జానకీరావును ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ కొద్దిగా నీరు తాగిన తర్వాత వాంతులు చేశాడు. స్థానిక ఆర్‌ఎంపీకి చూపించగా బీపీ తగ్గిందని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. ఆ మేరకు ఆటోలో కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అక్కడ్నుంచి పలాస ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం పంపించారు. మృతుడికి భార్య సరస్వతి, కుమార్తెలు చంద్రకళ(35), శాంతి(30), కుమారుడు గౌతమ్‌(25) ఉన్నారు. ఈ సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కాశీబుగ్గ సీఐ ఆర్‌ వేణుగోపాల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు