బావ కోసం వెళ్లి .. తిరిగిరాని లోకాలకు..

17 Jan, 2019 06:35 IST|Sakshi
సంఘటన స్థలంలో సోమేశ్వరరావు మృతదేహం

ద్విచక్ర వాహనం ఢీకొని యువకుడి మృతి

పండగపూట రాజుపేటలో విషాదం

విశాఖపట్నం, కోటవురట్ల (పాయకరావుపేట):  పండగ రోజు అందరూ సంతోషంగా ఉన్న వేళ..ఓ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. బావ కోసం ఎదురుగా వెళ్లిన ఆ యువకుడు కలుసుకోకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ప్రమాద వార్త ఆ ఇంట్లోనే కాదు గ్రామంలో విషాదం నింపింది. వివరాలిలావున్నాయి. రాజుపేటకు చెందిన మళ్ల సోమేశ్వరరావు (26) మంగళవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో అక్కడిక్కడే మృతి చెందాడు. పండగకు ఇంటికి వస్తున్న బావ మోటార్‌ బైక్‌ కొడవటిపూడిలో చెడిపోవడంతో తీసుకొచ్చేందుకు ఎదురుగా వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బైక్‌ ప్లగ్‌ను కోటవురట్లలో కొనుగోలు చేసిన సోమేశ్వరరావు వెంట మళ్ల సాయిని కుర్రాడిని తీసుకుని బైక్‌పై బయలుదేరాడు.

తిమ్మాపురం దాటాక  కె.వెంకటాపురం సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న టీవీఎస్‌ ఎక్సెల్‌ మోపెడ్‌ బలంగా ఢీకొట్టింది. దాంతో వాహనం నడుపుతున్న సోమేశ్వరరావు తల రోడ్డుకు తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న సాయి స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీవీఎస్‌ ఎక్సెల్‌ మోపెడ్‌పై ఉన్న కాళ్ల మాలక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం రెండు కాళ్లు విరిగిపోయి, పళ్లు ఊడిపోవడంతో  కేజీహెచ్‌కు తరలించారు. మృతుని సోదరుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతి చెందిన సోమేశ్వరరావు నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ముగ్గురు అన్నల తర్వాత చివరివాడు. కబడ్డీ పోటీలలో జిల్లా స్థాయిలో పలు పోటీలలో ప్రతిభ చూపి మంచి క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. పేదరికం కారణంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఇంతలో ఈ ప్రమాదం అనంతలోకాలకు చేర్చింది. పండగ రోజున మరణవార్త విన్న కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీరుపెట్టారు.

మరిన్ని వార్తలు