ప్రాణం తీసిన అతివేగం

15 May, 2019 12:31 IST|Sakshi
కిషోర్‌కు సపర్యలు చేస్తున్న యువకులు (ఇన్‌సెట్‌) మొల్లి రాజేష్‌ (ఫైల్‌)

మోటారు సైకిల్‌ అదుపు తప్పి యువకుడి మృతి

మరో యువకుడికి తీవ్ర గాయాలు

విశాఖపట్నం, ఆనందపురం(భీమిలి) : మండలంలోని గిడిజాల పంచాయతీ వేమగొట్టిపాలెం వద్ద మంగళవారం మోటారు సైకిల్‌ అదుపు తప్పి గెడ్డలోకి దూసుకుపోయిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందాడు. మరో యువకుడు చికిత్స పొందుతున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెందుర్తి మండలం రాజయ్యపేట పంచాయతీ బంధంవానిపాలెం గ్రామానికి చెందిన నమ్మి కిషోర్‌(25), మొల్లి రాజేష్‌(26)లు ఆనందపురం మండలం జోడువానిపాలెం గ్రామంలో జరుగుతున్న వివాహానికి మంగళవారం మోటార్‌ బైక్‌పై బయలుదేరారు. వారు మార్గమధ్యలో గిడిజాలలో ఉన్న మద్యం షాపు వద్ద మద్యం తాగి పలువురితో గొడవ పడినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో ముచ్చర్ల గ్రామానికి చెందిన గండ్రెడ్డి రాముతో గొడవ పడడంతోపాటు అతడిని బీర్‌ బాటిల్‌తో కొట్టి పరారయ్యే క్రమంలో మోటార్‌ బైక్‌ని నమ్మి కిషోర్‌ అతి వేగంగా నడడపడంతో వేమగొట్టిపాలెం వద్ద అదుపు తప్పి గెడ్డలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కిషోర్‌తోపాటు బైక్‌ వెనుక వైపు కూర్చున్న రాజేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా అటు వైపుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్‌కు గెడ్డలో మూలుగులు వినబడడంతో పరిశీలించగా ఇద్దరు యువకులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించి 108 వాహనానికి సమాచారం అందించాడు. ఈలోగా అటువైపు వెళ్తున్న పలువురు యువకులు క్షతగాత్రులకు సపర్యలు చేసి చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాజేష్‌ మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మోటార్‌ బైక్‌ని స్వాధీనం చేసుకొని స్థానికులను విచారించారు. సీఐ శంకరరావు ఆధ్వర్యంలో కేసుని స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని మహిళకు గాయాలు
మండలంలోని వేములవలస పరిధిలో వేంకటేశ్వర పాఠశాలకు సమీపంలో రోడ్డు పై బైక్‌ని లారీ ఢీ కొనడంతో మహిళ తీవ్రంగా గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ఆనందపురం వైపు నుంచి తగరపువలస వెళ్తున్న మోటార్‌ బైక్‌ని రోడ్డు పక్కన ఆపారు. ఈలోగా ఏలూరు నుంచి వస్తున్న లారీ మోటార్‌ బైక్‌ని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక వైపు కూర్చున్న యాండ్రపు తౌడమ్మ కింద పడడంతో... ఆమె పైనుంచి లారీ వెళ్లి పోవడంతో రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ మేరకు తౌడమ్మను చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించి స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు