నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

21 Oct, 2019 09:04 IST|Sakshi
ప్రమాద స్థలంలో పైడినాయుడు మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య బిందు

బైక్‌ను ఢీ కొట్టిన లారీ

ప్రమాదస్థలంలోనే భర్త మృతి, భార్యకు స్వల్ప గాయాలు

అస్తవ్యస్తంగా ఉన్నరహదారులే కారణం

ఆనందపురం (భీమిలి): రోడ్డు నిర్మాణ కాంట్రాక్టరు నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. నిర్మాణ పనుల నిమిత్తం పాత రోడ్డుని మూసివేసి, తాత్కాలిక రోడ్లు ఏర్పాటు చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. హెచ్చరిక బోర్డులు, రూటు తెలిపే సంకేతాల బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ నిర్లక్ష్యం వహించడంతో ఏ వాహనం ఎటు వెళ్తుందో తెలియని గందరగోళ పరిస్థితుల వల్ల ప్రమాదం సంభవించి నిండు ప్రాణం బలైంది. స్థానికంగా ఉన్న ప్లై ఓవర్‌ పక్కన ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్య స్వల్ప గాయాలతో బయటపడింది. తలకు హెల్మెట్‌ ఉన్నా లారీ చక్రాలు తలపై నుంచి వెళ్లి పోవడంతో తల నుజ్జునుజ్జయిపోయింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తర్లువాడ పంచాయతీ నగరప్పాలెం గ్రామానికి చెందిన బాయిన పైడినాయుడుకు విజయవాడకు చెందిన బిందుతో తొమ్మిదేళ్ల  క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పైడినాయుడు తల్లిదండ్రులు గతంలోనే మరణించారు.

బోయిపాలెంలో ఉన్న మీ సేవా కేం ద్రంలో పనిచేసుకుంటూ కుటంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా ఆదివారం పైడినాయుడు భార్య బిందుతో కలిసి మండలంలోని మెట్టమీదపాలెం గ్రామంలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మధురవాడలో మరో శుభకార్యానికి హాజరు కావాల్సి ఉండడంతో దంపతులిద్దరూ బైక్‌పై బయలుదేరి వెళ్తున్నారు. ఆనందపురం జంక్షన్‌లో ప్లై ఓవర్‌ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఆ పక్క నుంచి జాతీయ రహదారిని చేరుకోవడానికి తాత్కాలిక రోడ్డుని ఏర్పాటు చేశారు. కాగా పైడినాయుడు దంపతులు ప్లై ఓవర్‌ కిందకి చేరుకోవడానికి మోటార్‌ బైక్‌పై వెళ్తుండగా పెందుర్తి వైపు నుంచి వస్తున్న లారీ జాతీయ రహదారిపైకి చేరుకోవడానికని డ్రైవర్‌ ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండా తాత్కాలిక రోడ్డు మలుపు వద్ద ఎడమ వైపునకు మళ్లించాడు. దీంతో బైక్‌ని లారీ ఢీకొట్టడంతో బైక్‌ వెనుక కూర్చున్న బిందు తూలి దూరంగా పడిపోయింది. ఈ సంఘటనలో పైడినాయుడు బురదగా ఉన్న గోతిలో పడిపోగా అతనిపై బైక్‌ ఉండిపోయింది. దీంతో బైక్‌తోపాటు పైడినాయుడు తలపై నుంచి లారీ వెళ్లిపోవడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. బిందుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమై పరారైపోతున్న లారీని కొంత మంది స్థానికులు కారుతో వెంబడించి పెద్దిపాలేనికి సమీపంలో పట్టుకున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ గణేష్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ జరిపారు.   

మిన్నంటిన మృతుడి భార్య రోదన
కళ్లెదుటే భర్త ప్రాణాలు విడవడంతో భార్య బిందు రోదించిన తీరు అందరినీ కలచి వేసింది. అయ్యో.. నా భర్త చనిపోయాడు.. నాకు, నా పిల్లలకు దిక్కెవరు అంటూ సంఘటనా స్థలంలోనే రోదిస్తూ కుప్పకూలిపోయింది. ఈ లోగా సమాచారం అందుకున్న బంధువులు ప్రమాద స్థలం వద్దకు చేరుకొని ఆమెకు సపర్యలు చేశారు.

మరిన్ని వార్తలు