దైవదర్శనానికి వెళ్తూ యువకుడి మృతి

4 Feb, 2019 10:07 IST|Sakshi
భార్యాపిల్లలతో మృతుడు సంతోష్‌

అనాథలైన భార్య, చిన్నారులు

రిక్షాకాలనీలో విషాదఛాయలు

విజయనగరం, చీపురుపల్లి: దైవ దర్శనానికి వెళ్తున్న వ్యక్తిపై విధికి కన్నుకుట్టింది. మరికొద్ది గంటల్లో విజయవాడ చేరుకుంటాడనున్న సమయంలో రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. దుర్గమ్మ సన్నిధికి వెళ్లిన తన భర్త ప్రసాదంతో వస్తాడనుకున్న భార్యకు రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడన్న విషయం తెలిసి తల్లడిల్లిపోయింది. కుటుంబ యజమాని మృతితో భార్య, ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. వివరాల్లోకి వెళితే...ఆదివారం తెల్లవారుఝామున పిఠాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని రిక్షా కాలనీకు చెందిన చీమకుర్తి సంతోష్‌ (33) అనే యువకుడి మృతి చెందాడు. సంతోష్‌ స్థానికంగా టాటా మ్యాజిక్‌ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. మిత్రులతో కలిసి విజయవాడలోని అమ్మవారిని దర్శించుకునేందుకు శనివారం మధ్యాహ్నం చీపురుపల్లి నుంచి బయిలుదేరాడు.

చీపురుపల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు ట్రైన్‌లో బయలుదేరిన సంతోష్, అతని మిత్రులు విశాఖపట్టణానికి చేరుకుని రాత్రి 11 గంటల సమయంలో విజయనగరం నుంచి విజయవాడ వెళ్లే వోల్వో బస్సును ఆశ్రయించారు. వాస్తవానికి విశాఖపట్టణం నుంచి విజయవాడకు రైలులో వెళ్లాల్సి ఉన్నప్పటికీ సంతోష్‌ అప్పటికే పరిచయం ఉన్న వోల్వో బస్సు డ్రైవర్‌తో మాట్లాడి అందులో వెళ్లారు. సంతోష్‌ వోల్వో బస్సు డ్రైవర్‌ సీటు పక్కన కూర్చున్నాడు. ఆదివారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సమీపంలో ముందు వెళ్తున్న లారీని తప్పించేక్రమంలో బస్సు డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో లారీ వెనుకభాగం బస్సుకు తగిలింది. దీంతో బస్సు ముందు అద్దాల్లోంచి సంతోష్‌ రోడ్డుపై పడిపోవడంతో ఆయనమీద నుంచి బస్సు వెళ్లిపోయింది.  దీంతో సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. 

అనాథలైన భార్యాపిల్లలు....
రిక్షాకాలనీకు చెందిన సంతోష్‌కు భార్య రామలక్ష్మితో పాటు హర్ష (6), భాగ్యలక్ష్మి (3) ఉన్నారు. కుమారుడు హర్ష ఒకటో తరగతి చదువుతున్నాడు. దైవ దర్శనానికి వెళ్లి వస్తాడనుకున్న సంతోష్‌ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు