అమర్‌నాథ్‌ యాత్రలో అపశ్రుతి

9 Jul, 2018 12:20 IST|Sakshi
వెంటిలేటర్‌ సహాయంతో చికిత్స చేస్తున్న దృశ్యం(పక్కన భార్య)   

జిల్లాకు చెందిన వృద్ధుడు బ్రెయిన్‌స్ట్రోక్‌తో మృతి

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

శ్రీకాకుళం రూరల్‌: అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన జిల్లాకు చెందిన వృద్ధుడు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతిచెందాడు. దీంతో నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటున్న అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సావూకారి రవీంద్రనాథ్‌ చౌదరి (72), భార్య భువనేశ్వరి గత నెల 18న శ్రీకాకుళం నుంచి ఓ ట్రావెల్‌ సంస్థ ఏర్పాటు చేసిన ప్యాకేజీతో బయలుదేరి వెళ్లినట్లు తమ రెండో కూతురు సుమన ఆదివారం తెలిపింది. 

ట్రావెల్‌ సంస్థ ఆధ్వర్యంలోనే పయనం

వీరిద్దరూ గత నెల 20వతేదీ నాటికి అమనాథ్‌ చేరుకున్నారు. ఈ 3న అమర్‌నాథ్‌ దైవదర్శనం చేసుకున్నాక అక్కడ్నుంచి వారుండే చోటుకు తిరిగి చేరుకున్నారు. మరుసటి రోజు 4న ఉదయం టిఫిక్‌ చేస్తుండగా రవీంద్రనాథ్‌కు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

దీంతో అక్కడే శ్రీనగర్‌లోని కాశ్మీర్‌ హాస్పిటల్‌లో వైద్య సేవలందించారు. దీంతో వెంటిలేటర్‌ తీయడానికి వీలు లేకపోవడంతో ఆయన్ను ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌లో శ్రీకాకుళం తరలించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇదేక్రమంలో ఒక్కసారిగా హార్ట్‌స్ట్రోక్‌ రావడంతో ప్రాణాలు వదిలారని ఏపీ భవన్‌ ప్రత్యేక కమిషనర్‌ ఆర్జీ శ్రీకాంత్‌ ఒక ప్రకటనలో మీడియాకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న మృతుడు కొడుకు కిరణ్‌ హైదరాబాద్‌ నుంచే హుటాహుటిన అమర్‌నాథ్‌ చేరుకున్నాడు. అయితే మృతదేహాం ఈ నెల 10వ తేదీకి శ్రీకాకుళానికి చేరుతుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లుతెలిసింది. 

కుటుంబ నేపథ్యం ఇదీ..

మృతుడు రవీంద్రనాథ్‌ టీచర్‌ స్థాయి నుంచి ఎంఈవోగాను, డీఐవోగాను, హెచ్‌ఎంగా వివిధ హోదాల్లో పనిచేస్తూ కొన్నేళ్ల క్రితం పదవీవిరమణ పొందారు. ఈయన భార్య కుడా టీచర్‌గా పదవీ విరమణ చేశారు. ఈయన స్వస్థలం వజ్రపుకొత్తూరు మండలం వంకులూరు గ్రామం అయినప్పటికీ జిల్లా కేంద్రంలోనే స్థరపడ్డారు.

వీరికి ముగ్గురు సంతానం. అందులో పెద్దమ్మాయి సృజన ఓంగోలు రిమ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా, రెండో అమ్మాయి సుమన శ్రీకాకుళంలోనే స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. వీరి తమ్ముడు కిరణ్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

తన తండ్రికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, అమర్‌నాథ్‌ యాత్రలో ఒక్కసారిగా మృత్యువాత పడటం నమ్మలేక పోతున్నామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

మరిన్ని వార్తలు