యాత్రికుల బస్సు బోల్తా.. ఒకరి మృతి

23 Feb, 2019 13:29 IST|Sakshi
ప్రమాద స్థలంలో కర్ణాటక యాత్రికులు

17 మందికి గాయాలు

బస్సు టైర్‌ పగలడంతో ఘటన

కర్నూలు  ,ఓర్వకల్లు: యాత్రికుల బస్సు బోల్తా పడి ఒకరు మృతిచెందగా, 17 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లా బేలూరు పట్టణానికి చెందిన 52 మంది యాత్రికులు కేఏ 06 డి 4887నంబర్‌ శివగంగ ట్రావెల్‌ (తుమ్‌కూర్‌) టూరిస్టు బస్సు çకర్నూలు జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాల సందర్శనార్థం బయలు దేరివచ్చారు. శ్రీశైలం, మహానంది క్షేత్రాలను దర్శించుకొని తిరుగు ప్రయాణంలో మంత్రాలయానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ఓర్వకల్లు వద్దకు చేరుకోగానే 40వ నంబర్‌ జాతీయ రహదారిపై బస్సు ముందు చక్రం పగిలి ప్రమాదవశాత్తు అదుపుతప్పింది.

ఈ క్రమంలో నంద్యాల నుంచి కర్నూలు వైపు వెళ్లుతుండగా ఎడమవైపు నుంచి కుడి వైపునకు వేగంగా దూసుకెళ్లి కర్నూలు నుంచి సెంట్రింగ్‌ సామగ్రితో వస్తున్న మినీ లారీని ఢీకొట్టి ఫ్లైఓవర్‌ వంతెనపై నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వైపు ఉన్న సర్వీస్‌ రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదంలో 15 మంది కన్నడ యాత్రికులతో పాటు మినీ ట్రక్కు డ్రైవర్‌ ఫరూక్‌బాషా, హెల్పర్‌ వినోద్‌కుమార్‌ గాయపడ్డారు. ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బోల్తా పడగానే యాత్రికులు పెద్దఎత్తున ఆర్థనాదాలు చేయడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక ఎస్‌ఐ మధుసూదన్‌రావు పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మూడు 108 వాహనాల్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కన్నడ భక్తుడు గోవింద్‌ స్వామి(50) కోలుకోలేక మృతి చెందాడు. 

ప్రముఖుల పరామర్శ
టూరిస్టు బస్సు బోల్తా పడిన విషయం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ వేర్వేరుగా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాద తీరును పరిశీలించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

కలెక్టర్‌ పరామర్శ
కర్నూలు(హాస్పిటల్‌): ఓర్వకల్‌ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. సత్యనారాయణ పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్చారు. వీరిని సాయంత్రం జిల్లా కలెక్టర్‌ కలిసి పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ను ఆదేశించారు.  

క్షతగాత్రులు వీరే..
కర్ణాటక రాష్ట్రానికి చెందిన రంగస్వామి, పుత్తురాజ్, బీటీ దేవి, శోభ, నాగమ్మ, నాగరాజు, శాంతమ్మ, ఇందిరా, సరస్వతి, సర్వమంగళ, దేవమ్మ, రామయ్య, తాయమ్మ, సిద్దలింగమ్మ వీరందరు మాండ్యా జిల్లా నాగమంగళ తాలుకా బేలూర్‌ పట్టణ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఇక తుంకూరు టూరిస్టు బస్సు డ్రైవర్‌ రవికుమార్, ట్రక్కు డ్రైవర్‌ షేక్‌ ఫరూక్‌బాషాకు తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రక్కుహెల్పర్‌ వినోద్‌కుమార్‌ కర్నూలు నగరంలోని లక్ష్మినగర్‌కు చెందిన వాసి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూలు తాలుకా రూరల్‌ సీఐ పవన్‌కిశోర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు