దుబాయ్‌ వెళ్తూ.. ‘దుర్గమ్మ’ వద్ద మృతి

14 May, 2018 08:37 IST|Sakshi
దుర్గేశ్‌ మృతదేహం

పాపన్నపేట(మెదక్‌) : నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడకు చెందిన ఓ యువకుడు దుబాయ్‌ వెళ్లేందుకు సిద్ధమై ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చి చెక్‌డ్యాంలో దిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం ఏడుపాయల్లో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. బాన్సువాడకు చెందిన కుమ్మరి దుర్గేశ్‌(30) బతుకు దెరువు కోసం దుబాయ్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈమేరకు బుధవారం ఇంటి నుంచి బొంబాయి వెళ్లాల్సి ఉంది.

ఈలోగా ఇష్టదైవమైన దుర్గమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఆదివారం బావ శ్రీనివాస్‌తో కలిసి ఏడుపాయలకు వచ్చాడు. సాయంత్రం స్నానం చేసేందుకు చెక్‌డ్యాంలోకి దిగాడు. ఈ క్రమంలో స్నానం చేస్తుండగా నీట మునిగి చనిపోయాడు. ఈ విషయం గమనించని బావ శ్రీనివాస్‌ చెక్‌డ్యాం పరిసరాల్లో వెతకగా దుర్గేశ్‌ బట్టలు ఒడ్డున కనిపించాయి. దీంతో ఏడుపాయల సిబ్బందికి సమాచారం అందించగా గజ ఈతగాళ్లు చెక్‌డ్యాంలో వెతికి దుర్గేశ్‌ శవాన్ని బయటకు తెచ్చారు. వెంట వచ్చిన బావమర్ధి దుర్గమ్మ తల్లి దర్శనం కాకుండానే దుర్మరణం చెందడంతో శ్రీనివాస్‌ కన్నీరు మున్నీరయ్యాడు. తమ బతుకులు బాగుచేస్తాడనుకున్న దుర్గేశ్‌ మరణ వార్త భార్య లలిత, తండ్రి బాలయ్య, తల్లి తులసమ్మలకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దుర్గేశ్‌కు కొడుకు, కూతురు ఉన్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు