ఆశలు సమాధి చేస్తూ..   

6 Aug, 2018 14:21 IST|Sakshi
నవీన్‌ (ఫైల్‌) 

డాక్టరై వస్తాడనుకుంటే  విగతజీవిగా రానున్నతనయుడు

విహారయాత్రలో విషాదం

సరస్సులో మునిగి  భువనగిరికి చెందిన   నవీన్‌ మృతి

రష్యాలో దుర్ఘటన

కొడుకు లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు

భువనగిరిలో విషాద ఛాయలు

భువనగిరి క్రైం : కుమారుడిని డాక్టర్‌గా చూడాలనుకున్న ఆ తల్లిదండ్రులు.. మెడిసిన్‌ విద్యకోసం అతన్ని రష్యాకు పంపించారు. మరో ఆరు నెలలైతే కోర్సు పూర్తి చేసుకుని తిరిగి వస్తాడనుకున్న తరుణంలో విధి వారి ఆశలను చిదిమేసింది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆ యువకున్ని మృత్యువు కబళించింది.

భువనగిరికి చెందిన నవీన్‌కుమార్‌ రష్యాలోని ఓ సరస్సులో నీట మునిగి చనిపోవడం తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. వారు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. కాగా నవీన్‌ మృతదేహం మంగళవారం దేశానికి వచ్చే అవకాశం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

భువనగిరిలోని ఆర్బీనగర్‌కు చెందిన గుజ్జ హేమలత, యాదగిరి దంపతులకు ఇద్దరు కుమారులు. యాదగిరి భువనగిరి లోని చిన్నవ్యాపారం చేస్తుంటాడు. హేమలత గృహిణి. వీరి పెద్దకొడుకు నవీన్‌(22) పదో తరగతి వరకు భువనగిరిలోని కృష్ణవేణి హైస్కూల్‌లో చదివాడు. ఇంటర్‌ బోడుప్పల్‌లోని ఓ ప్రై వేటు కళాశాలలో.. తరువాత ఎంబీబీఎస్‌ చేసేందుకు 2013లో రష్యా దేశంలోని ఓరెన్‌బర్గ్‌ సీటీలోని ఓరెన్‌బర్గ్‌ మెడికల్‌ యూనివర్సిటీలో చేరాడు.

తన తండ్రి కష్టం విలువ తెలిసిన నవీన్‌ వారి ఆశలను బతికిస్తూ చదువులో మంచి ప్రతిభను కనబరిచేవాడు. తన స్నేహితుల్లో ఎవరికైనా ఆపద వస్తే తనే ముందుండే వాడని, అందరి కష్టాలను పంచుకుని ధైర్యం చెప్పేవాడని తోటి స్నేహితులు చెబుతున్నారు. 

మరో ఆరునెలల్లో కోర్సు పూర్తి

నవీన్‌ ఎంబీబీఎస్‌ కోర్సు మరో ఆరు నెలల్లో పూర్తికానుంది. ఈ క్రమంలో తనకు ప్రస్తుతం రెండు నుంచి మూడు నెలలపాటు కళాశాల సెలవు ప్రకటించింది. ఈ సెలవుల్లో విహారయాత్రకు వెళ్దామని నిర్ణయించుకుని స్నేహితులంతా కలిసి వారు ఉంటున్న నగరానికి 1,757 కీమీ దూరంలో ఉన్న స్ట్రావోపూల్‌ నగరంలోని కోమ్సోమోలీస్కిపూల్‌ అనే సరస్సుకు వెళ్లారు.

ప్రస్తుతం అక్కడ మంచు పడే అవకాశాలు తక్కువగా ఉండడంతో అంతా కలిసి వెళ్లారు. అప్పటికే వారు విహారయాత్రకు వెళ్లి వారం రోజులు అవుతుంది. శుక్రవారం ఏడో రోజులో భాగంగా ఆ సరస్సు దగ్గరికి వెళ్లారు. సాయంత్రం సమయంలో నలు గురు మిత్రులు కలిసి అక్కడికి వెళ్లారు. నవీన్‌తో ఉన్న మరో మిత్రుడికి ఈత రాకపోవడంతో నవీన్‌ ఆ మిత్రుడికి తోడుగా అక్కడే కూర్చున్నాడు. మిగతా ఇద్దరు మిత్రులు నీటిలో దిగి ఈత కొడుతుండగా నీటి ప్రవాహం ఎక్కువ అవుతుండడంతో పాటు నీరు బాగా చలిగా ఉంది.

దీంతో నీటిలో ఉన్న మిగతా ఇద్దరు స్నేహితులు నీటిలో నుంచి బయటికి వచ్చారు. కానీ వీరు బయటికి వస్తున్న క్రమంలోనే నవీన్‌ నీటిలో ఈత కొట్టడానికి దూకాడు. మిగతా స్నేహితులు నవీన్‌ను గమనించలేదు. నవీన్‌ ఈత కొడుతుండగా నీటి ప్రవాహం ఒకేసారిగా పెరిగి నీరు పూర్తిగా చల్లగా అవడంతో నవీన్‌ ఉక్కిరిబిక్కిరై బిగుసుకుపోయి నీటిలో ఈదలేక ప్రాణాలు కోల్పోయాడు. దీనిని గమనించిన  మహిళ అక్కడే ఉన్న స్నేహితులకు చెప్పడంతో వారు వెంటనే నీటిలోకి దూకి వెతికారు.

కానీ నవీన్‌ ఆచూకీ లభించలేదు. వారు వెంటనే బయటికి వచ్చి సరస్సు గార్డ్స్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న గార్డ్స్‌ స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు నాలుగు గంటల సుధీర్ఘ గాలింపు తరువాత నవీన్‌ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన నవీన్‌ తోటి మిత్రులు అక్కడే తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

అప్పటిదాక తమతో నవ్వుకుంటూ కబుర్లు చెప్పి న స్నేహితుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. బాధతో వెంటనే ఈ విషయాన్ని నవీన్‌ తల్లిదండ్రులకు ఎలా తెలియజేయాలో అర్థం కాక సతమతుమవుతూనే నవీన్‌ తండ్రికి ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని తెలియజేశారు.

తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు

విషయం తెలుసుకున్న నవీన్‌ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు తీవ్ర ది గ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఏం జరిగిందో తెలియక అయోమయం చెందారు. చేతికి వచ్చిన కొడుకు ఇక లేడు అనే విషయాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. డాక్టర్‌గా చూడలనుకున్నా కొడుకును విగతజీవిగా చూడాల్సివస్తుందే..అని వారు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. నవీన్‌ మృతదేహం మంగళవారం నాటికి మన దేశానికి వస్తుందని నవీన్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. తనతో ఉన్న స్నేహితులు మృతదేహాన్ని అక్కడి దేశ నిబంధనల ప్రకారం తీసుకొస్తున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు