కారు బీభత్సం.. యువకుడి మృతి

10 Dec, 2018 09:11 IST|Sakshi
మృతి చెందిన పవన్‌ కళ్యాణ్‌ (ఫైల్‌) , ప్రమాదానికి గురైన కారు

లంగర్‌హౌస్‌: ఆదివారం తెల్లవారు జామున ఓ కారు  బీభత్సం సృష్టించింది. డివైడర్‌ను ఢీ కొట్టి అవతలి వైపు రోడ్డు పై పల్టీ కొట్టింది. ఈ సంఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారు జామున లంగర్‌హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌లో జరిగింది.  పోలీసులు తెలిపిన మేరకు.. నానల్‌నగర్‌ ఫ్లోర్‌ మిల్‌ చౌరస్తా నుండి తెల్లవారు జామున 3.40 గంటలకు (ఏపి 10 ఏఎన్‌ 8430 హోండా సిటీ) కారు లంగర్‌హౌస్‌ వస్తున్నది. లంగర్‌హౌస్‌ మిలటరీ ఆసుపత్రి వద్దకు రాగానే కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అంతేకాకుండా డివైడర్‌ మీదనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ విద్యుత్‌ స్తంభం కూడా పూర్తిగా ఊడిపోయి గాలిలో ఎగురుతూ డివైడర్‌కు అవతలి వైపు పడింది. ఇదే సమయంలో  ఆ కారు రోడ్డు అవతలి వైపు ఉన్న రోడ్డు పై పల్టీలుకొట్టింది. ఈ సంఘటనలో కారు ముందు భాగం, అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

కారు నడుపుతున్న యువకుడితో పాటు అతని పక్కనే కూర్చున్న మరో యువకుడు పగిలిన కారు అద్దాల నుంచి రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో అటు వైపు నుంచి వస్తున్న ఓ కారు కూడా వేగంగా వచ్చి ఆగకుండా వెళ్లిపోయింది. కాగా కారులో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు అదే కారులో ఉన్న సాయినాథ్‌ (25) కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. అతనిని చికిత్స నిమిత్తం నానల్‌నగర్‌ ఆలివ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మృతి చెందిన పవన్‌ కళ్యాణ్‌ లంగర్‌హౌస్‌లోని మల్లికా స్కూల్‌ వద్ద గొల్లబస్తి నివాసి అని, చికిత్స పొందుతున్న సాయినాథ్‌ కూడా విద్యార్థి అని పోలీసులు తెలిపారు. కారు వెనుక సీట్లో మరో యువకుడు ఉన్నాడని, అతడు ప్రమాద సమయంలో కారు డోరు తీసి కారులో నుండి కిందికి దూకేసాడని పోలీసులు అంటున్నారు. అతని ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు