పండగ వేళ విషాదం

2 Sep, 2019 11:24 IST|Sakshi
 ద్విచక్రవాహనాలపైకి దూసుకొచ్చిన కారు ఇన్‌సెట్లో జహంగీర్‌ మృతదేహం,

సాక్షి, జనగామ(వరంగల్‌) : వినాయక చవితి ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. పండగ సరుకుల కోసం సంతకు వెళ్లి వస్తుండగా.. మృత్యువు రూపంలో దూసుకువచ్చిన ఓ కారు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన జనగామ మండలం పెంబర్తి వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. సంఘటనకు సంబంధించిన ఎస్సై శ్రీనివాస్‌ తెలిపాన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన జూకంటి జహంగీర్‌(40), కొమురయ్య, సిద్ధులు వినాయక చవితి పండగ సరుకులతో పాటు ఇతర పనుల నిమిత్తం ద్విచక్రవాహనాలపై జనగామ జిల్లా బచ్చన్నపేట సంతకు వెళ్లారు.

పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా స్వగ్రామానాకి వెళ్లే ఎక్స్‌(టంగుటూరు) రోడ్డు మలుపు వద్ద ముగ్గురు కలవడంతో రహదారి పక్కన కాసేపు ఆగి మాట్లాడుకుంటుండగా వరంగల్‌ వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి, రాంగ్‌ రూట్‌లో వీరు నిలబడిన ప్రదేశానికి దూసుకొచ్చింది. కారువేగాన్ని గమనించిన వారు తప్పించుకునే లోపే వారిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జూకంటి జహంగీర్‌ అక్కడిక్కడే మృతిచెందగా, సిద్ధులు, కొమురయ్యలకు తీవ్రగాయాలు కాగా క్షతగాత్రులను 108లో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి హైదరాబాద్‌కు రెఫర్‌ చేశారు. కాగా, మృతిచెందిన జహంగీర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు