కళ్లెదుటే కుమారుడి దుర్మరణం

14 Jan, 2020 12:03 IST|Sakshi
రోదిస్తున్న కుటుంబసభ్యులు జక్కు రవి(ఫైల్‌)

కాలువ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మృత్యువాత

భర్త మరణంతో విషాదంలో భార్యా, పాప

మిన్నంటిన కుటుంబసభ్యుల రోదనలు

కరీంనగర్‌, హుజూరాబాద్‌రూరల్‌: తల్లిని కాపాడబోయి తనయుడు మృతిచెందిన విషాద సంఘటన ధర్మరాజుపల్లిలో చోటుచేసుకుంంది. తలకొరివి పెడతాడని అనుకున్న కుమారుడు తనకళ్ల ముందే కానరాని లోకాలకు వెళ్లడంతో కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిని చూసి పలువురు కంటతడిపెట్టుకున్నారు. గ్రామస్తులు, పోలీసులు, కుటుంబసభ్యులు వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన సారయ్య–సారమ్మలకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తె ఉన్నారు. వీరి చిన్న కొడుకు జక్కు రవి(26)ని కూలీనాలీ చేస్తూ డిగ్రీ వరకు చదివించారు. ఉద్యోగాన్వేషణ చేస్తూనే తల్లిదండ్రులు చేసే చిరు వ్యాపారానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. గోదావరిఖనికి చెందిన మెరుగు వెంకటేశం–పార్వతీల పెద్ద కూతురు అనూష(లావణ్య)ను నాలుగేళ్లక్రితం రవికి ఇచ్చి వివాహం చేశారు.

వీరికి రెండేళ్ల కూతురు సాన్విక ఉంది. భార్య అనూష పండుగకు పుట్టింటికి వెళ్లింది. గ్రామ శివారులోని డీబీఎం–18బీ ఎస్సారెస్పీ కాలువలో నీళ్లు వస్తుండడంతో బట్టలు ఉతికేందుకు తల్లి సారమ్మను తీసుకొని రవి బైక్‌పై కాలువ గట్టు వద్దకు వెళ్లాడు. కాలువలోకి దిగి బట్టలు ఉతికేందుకు తల్లికి సహకారం అందిస్తున్న సమయంలో ఓ చీరె నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడాన్ని గమనించిన తల్లి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది. దీంతో నీటిలో పడిపోతుండగా రవి కాపాడబోయాడు. ఈ క్రమంలో రవి కాలువలోపడిపోయాడు. ఈతరాకపోవడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఈ సమయంలో తల్లి సారమ్మ కేకలువేయగా సమీప పొలాల్లో పని చేస్తున్న రైతులు, కూలీలు గమనించి రవిని రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందాడు. మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. రవి మృతితో భార్య అనూష, కూతురు సాన్విక ఒంటరయ్యారు. మృతుడి సోదరుడు భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు టౌన్‌ సీఐ మాధవి తెలిపారు.

మరిన్ని వార్తలు