‘ఇంటి’వాడు కాకముందే.

10 May, 2018 14:27 IST|Sakshi
కోటేశ్వరరావు మృతదేహం

 గృహప్రవేశం, పెళ్లికి    ముహూర్తాలు నిర్ణయం

కొత్త ఇంటిలో విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు 

చిన్నప్పటి నుంచి కష్టపడి ఇప్పుడిప్పుడే చిన్నగా ఎదుగుతున్న అతన్ని చూసి విధికి కన్నుకుట్టింది. ఒక వైపు గృహప్రవేశం, మరో వైపు పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించుకుని రెట్టింపు ఉత్సాహం తో ఉన్న ఆ యువకుడిని విద్యుత్‌ షాక్‌ రూపంలో మృత్యువు కాటేసింది.  ఎన్నో ఆశలతో నిర్మించుకున్న సొంత ఇంటి వద్దే విద్యుత్‌ షాక్‌కు గురై  తుదిశ్వాస విడిచి   కన్నవారికి, ఆత్మీయులకు తీరని శోకం మిగిల్చాడు.

తుమ్మపాల(అనకాపల్లి) విశాఖపట్నం : మండలంలో కుంచంగి గ్రామంలో బుధవారం విద్యుత్‌ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు.  పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.  కుంచంగి గ్రామానికి చెందిన  కోన కోటేశ్వరరావు(33) అనే వ్యక్తి ఇటీవల నిర్మించుకున్న నూతన భవనంలో గృహప్రవేశానికి  ఈ నెల 10న ముహూర్తం పెట్టుకున్నాడు.  దీంతో  హడావుడిగా తానే  ఇంటి ఎలక్ట్రికల్‌ పనులు చేస్తున్నాడు.  ఇంటికి అతి సమీపంలో ఉన్న ఆర్‌ఈసీఎస్‌ విద్యుత్‌ తీగల లైన్‌కు  తాను పట్టుకున్న ఇనుప తీగ (జీ–వైర్‌)తగిలింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురై కోటేశ్వరరావు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

 కోటేశ్వరరావు మృతదేహాన్ని  పోస్టుమార్టానికి స్థానిక ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు.   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి తెలిపారు.కోటేశ్వరరావు నిరుపేద కుటంబానికి చెందినవాడు. గ్రామానికి సమీపంలో ఉన్న స్టోన్‌క్రషర్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇటీవల వివాహం కుదిరింది. ఈ నెల 26న వివాహ ముహూర్తం పెట్టుకున్నారు. నూతనంగా నిర్మించుకున్న భవనంలో గృహప్రవేశం,  మరో పక్క పెళ్లి పనులను  తానే చేసుకుంటున్నాడు.

ఇంతలోనే   కోటేశ్వరరావు  మృతి చెందడంతో  గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  పెళ్లి చేయవలసిన  కుమారుడిని పూడ్చవలసి వచ్చిందంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
 

మరిన్ని వార్తలు