ప్రాణం తీసిన ఫ్లెక్సీ

22 Feb, 2019 08:41 IST|Sakshi
జగదీష్‌ మృతదేహం గాయపడిన ప్రసాద్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు

విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి

మరొకరికి గాయాలు

శ్రీకాకుళం, పాలకొండ: ఆ కుటుంబానికి ఒక్కడే కుమారుడు.. డిగ్రీ వరకూ చదువుకుని స్వయం ఉపాధి పొందుతూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ప్రతి రోజు గ్రామం నుంచి పాలకొండ వచ్చి నెట్‌ సెంటర్‌ నడుపుతూ అందరి వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు. సరదాగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఫ్లెక్సీ తీరని శోకం మిగిల్చింది. చేతికి అందుకు వచ్చిన కుమారుడ్ని కాటికి తీసుకుపోయింది. పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కోటదుర్గమ్మ ఆలయం వద్ద గురువారం మధ్యాహ్నం విద్యుత్‌ షాక్‌కు గురై యువకుడు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన చందక వెంకటరావు, గౌరీశ్వరిల కుమారుడు చందక జగదీష్‌(30) డిగ్రీ చదువుకుని ఉపాధి కోసం కోటదుర్గమ్మ ఆలయం సమీపంలో మేడపై ఇంటర్నెట్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం షాపు వచ్చి పనులు చేసుకుంటున్నాడు. షాపునకు అడ్డంగా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించేందుకు సిద్ధమయ్యాడు. అదే గ్రామానికి చెందిన స్నేహితుడు లావేటి ప్రసాద్‌ సహాయంతో ఫ్లెక్సీని తొలగిస్తుండగా పక్కనే ఉన్న 33 కేవీ విద్యుత్‌ లైన్‌ జగదీష్‌కు తాకింది. దీంతో అక్కడికి అక్కడే మేడపైన పడి మృతిచెందాడు. జగదీష్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించిన ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ప్రసాద్‌ను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతనికి ఎడమ చేయి వేళ్లు కాలిపోయి, వీపుపై బలమైన గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. జగదీష్‌ మృతదేహాన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రవీంద్రకుమార్‌ పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహం అప్పగించారు. ఎస్సై వాసునారాయణ కేసు నమోదు చేశారు.

ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీల ఏర్పాటు..
నగర పంచాయతీలో ఫ్లెక్సీలను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు అయితే షాపులు, విగ్రహాలను కప్పి మరీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా కోటదుర్గమ్మ ఆలయం కూడా కనిపించకుండా బ్యానర్లు కడుతున్నారు. దీంతో నిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని వార్తలు