పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగిరాలేదని.. 

3 Jul, 2019 12:12 IST|Sakshi
ఆస్పత్రిలో తుకారాం మృతదేహం 

సాక్షి, మర్పల్లి(రంగారెడ్డి) : పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి కాపురానికి రాలేదని మనస్తాపానికి గురైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మర్పల్లి మండల పరిధిలోని షాపూర్‌ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. మర్పల్లి ఎస్‌ఐ వెంకటనారాయణ, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. షాపూర్‌ గ్రామానికి చెందిన బానోతు తుకారాం (30) సంగారెడ్డి జిల్లా మెగడంపల్లి మండలం పగిడాలతండాకు చెందిన తుకారాం కూతురు సక్కీబాయితో 2006లో వివాహం జరిగింది. కొన్నాళ్లు షాపూర్‌లోని ఇంటివద్దనే ఉన్న దంపతులు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌ వచ్చారు. తుకారాం ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం కుటుంబ విషయమై భార్యభర్తలు గొడవపడ్డారు.

మనస్తాపం చెందిన సక్కీబాయి హైదరాబాద్‌ నుంచి పుట్టింటికి చేరింది. దీంతో తుకారాం షాపూర్‌కు వచ్చాడు. జరిగిన గొడవ విషయమై ఇరువురు వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. భార్యను కాపురానికి తీసుకువచ్చేందుకు తుకారాం పగిలాడతండాకు నాలుగు సార్లు వెళ్లాడు. ప్రతీ సారి సక్కిబాయి తల్లిదండ్రులు, బావమరిది దుర్భాషలాడి పంపేవారు. మూడు రోజుల క్రితం తన భార్య సక్కీబాయిని కాపురానికి పంపాలని అత్తామామలకు ఫోన్‌ చేశాడు. సక్కీబాయి తల్లి తమ కూతురును పంపించేది లేదని, మరొకరికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పింది.

మనస్తాపానికి గురైన తుకారాం షాపూర్‌లోని తన ఇంట్లో సోమవారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సోమవారం సాయంత్రం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ విషయమై మృతుడి తల్లి మంగళవారం మర్పల్లి పోలీసులకు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటనారాయణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు