రక్షించేందుకు వెళ్లి..

24 Sep, 2019 10:29 IST|Sakshi
సత్తిబాబును వ్యాన్‌లో ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం  

సాక్షి, శృంగవరపుకోట(విజయనగరం): మండలంలోని పోతనాపల్లి శివారు కృష్ణంరాజు చెరువులో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించేందుకు దిగిన విశాఖ డెయిరీ పాలకేంద్రం–2  అధ్యక్షుడు కూనిరెడ్డి సత్తిబాబు (58) మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మృతుని బంధువులు, ప్రత్యక్షసాక్షులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. పోతనాపల్లి గ్రామానికి చెందిన చలుమూరి ప్రసాద్‌ తన గేదెలను గ్రామ సమీపంలో గల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాల వైపు మేత కోసం తీసుకెళ్లాడు. ఉదయం 11.30 గంటల సమయంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న కృష్ణంరాజు చెరువులో గేదెలు దిగాయి. అయితే గేదెలు ఒడ్డుకు రాకపోవడంతో ప్రసాద్‌ చెరువులో దిగి వాటిని తోలే ప్రయత్నంలో మునిగిపోసాగాడు. ఇంతలో ఒడ్డున ఉన్న ప్రసాద్‌ భార్య తన భర్త మునిగిపోతున్నాడంటూ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న కూనిరెడ్డి జగదీష్, కాటకాని రాజు, పాముల ప్రసాద్, కూనిరెడ్డి సత్తిబాబులు చెరువులో దిగారు. మునిగిపోతున్న చలుమూరి ప్రసాద్‌ను రక్షించి ఒడ్డుకు తీసుకుని వస్తున్న క్రమంలో కూనిరెడ్డి సత్తిబాబు చెరువులో మునిగిపోయాడు.  

ప్రసాద్‌ను మాత్రం కూనిరెడ్డి జగదీష్, కాటకాని రాజు, పాముల ప్రసాద్‌లు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తీరా చూస్తే చలుమూరి ప్రసాద్‌ను రక్షించేందుకు దిగిన కూనిరెడ్డి సత్తిబాబు మునిగిపోయాడని గుర్తించారు. వెంటనే మళ్లీ చెరువులో దిగి మునిగిపోయిన సత్తిబాబును ఒడ్డుకు తీసుకుని వచ్చి ప్రైవేట్‌ వాహనంలో హుటాహుటిన ఎస్‌.కోట పట్టణంలో గల ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. సీహెచ్‌సీ డాక్టర్‌ మహర్షి కూనిరెడ్డి సత్తిబాబుని పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించడంతో ఆస్పత్రి ఆవరణ మృతుని బంధువుల రోధనలతో మిన్నంటింది. అప్పుడే ఇంటి వద్ద స్నానం చేసి బయటకు వచ్చిన కూనిరెడ్డి సత్తిబాబు తన సోదరి కుమారుడు ప్రసాద్‌ చెరువులో మునిగిపోతున్నాడని తెలిసి రక్షించేందుకు దిగి తను విగతజీవిగా మారాడాంటు భార్య రమణమ్మ, బంధువులు, పోతనాపల్లి గ్రామస్తులు బోరున విలపించారు. మృతుని సోదరుడు కూనిరెడ్డి వెంకటరావు ఫిర్యాదు మేరకు ఎస్సై కె. నీలకంఠం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎంతో సౌమ్యుడిగా పేరు..
మృతిచెందిన కూనిరెడ్డి సత్తిబాబు గ్రామంలోని విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో నడుస్తున్న పాల ఉత్పత్తిదారుల సంఘం – 2 అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. గ్రామ ప్రజలు, బంధువులు అందరితో సత్తిబాబు ఎంతో చనువుగా ఉంటూ సౌమ్యుడిగా పేరు పొందారు. ఈయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈయన మృతికి సంతాప సూచకంగా గ్రామంలో ఉన్న దుకాణాలు మూసివేశారు.

మరిన్ని వార్తలు