లక్ష్యం సాధించకనే..

11 Feb, 2019 13:57 IST|Sakshi
సంఘటనాస్థలంలో మృతి చెందిన టీ ఆంజనేయులు (ఇన్‌సెట్‌) ఆంజనేయులు(ఫైల్‌)

పోలీస్‌ ఉద్యోగ సాధనలో రన్నింగ్‌

లారీ ఢీకొని అక్కడికక్కడే

ఆంజనేయులు మృతి, మరో యువకుడికి తీవ్రగాయాలు

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాయచోటి(చిన్నమండెం) : చిన్నమండెం–రాయచోటి మార్గంలోని జల్లావాండ్లపల్లె సమీపంలో ఆదివారం ఉదయం రన్నింగ్‌ చేస్తున్న యువకులను లారీ ఢీకొన్న దుర్ఘటనలో తలారి ఆంజనేయులు (25) అక్కడిక్కడే మృతి చెందగా, టీ ప్రసాద్‌ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల మేరకు వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని దేవగుడిపల్లె పంచాయతీ బాపూజీనగర్‌ కాలనీకి చెందిన ఆంజనేయులు, ప్రసాద్‌ నిరుద్యోగులు. వీరు పోలీసు ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పరుగులో శిక్షణ పొందుతున్నారు. త్వరలో జరగనున్న పోలీసు ఎంపికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి రోజు సూర్యోదయం ముందే రాయచోటి–మదనపల్లె మార్గంపై పరుగు (రన్నింగ్‌) తీసేవారు. రోజూలాగే ఆదివారం తెల్లవారుజామున రహదారికి ఒక వైపున పరుగు తీస్తున్న సమయంలో మదనపల్లె వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ వీరిని ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనాస్థలం చేరుకుని గాయాలతో ఉన్న ప్రసాద్‌ను చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. సంఘటనపై చిన్నమండెం పోలీసులు విచారిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని, డైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్‌ఐ నాగరాజు తెలిపారు. ఆంజనేయులు మృతితో బాపూజీ నగర్‌ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆరు నెలల కిందటే వివాహం
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆంజనేయులుకు ఆరు నెలల కిందటే హరితతో వివాహమైంది. గతేడాది పోలీసు ఎంపికకు వెళ్లి, అర్హత సాధించలేకపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రానున్న పోలీసు ఎంపికలోనైనా ఉద్యోగం సాధించాలనే కసితో ప్రతిరోజు ఉదయం రోడ్డుపై పరుగు పెట్టేవాడని రోధిస్తూ తెలిపారు. ఉద్యోగం సాధించి వృద్ధాప్యం లో మాకు, భార్యకు తోడుగా ఉంటాడనుకున్న బిడ్డ లేడన్న మాటను తల్లిదండ్రులు జీర్ణించుకోలేక భోరు న విలిపించారు. రాత్రి తమందరితో కలిసి మట్లాడిన స్నేహితుడు ప్రమాదానికి గురై ఇక లేడన్న వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మృతిపై ఎమ్మెల్యే విచారం
రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు మృతి చెందడంపై రాయచోటి ఎమ్మెల్యే జీ శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో ఆంజనేయులు మృతదేహాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. సంఘటనకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సంఘటన పట్ల తీవ్ర విచారణ వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే జడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ పీ దేవనాథరెడ్డి ఫోన్‌ ద్వారా మృతుని కు టుంబ సభ్యులను పరామర్శించి, సంతాపాన్ని వ్య క్తం చేశారు. ఎమ్మెల్యే వెంట స్థానిక వైఎస్సార్‌సీపీ నా యకుడు జయశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు