ప్రాణాలను బలిగొన్న ‘బుల్లెట్‌ ’ సరదా

2 Jul, 2019 06:21 IST|Sakshi
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న కాశీబుగ్గ పోలీసులు 

సాక్షి, కాశీబుగ్గ(శ్రీకాకుళం) : తన స్నేహితుడి బుల్లెట్‌ (రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌) తీసుకుని వ్యాపారపరమైన పని నిమిత్తం బయలు దేరిన కాసేపటికే యువకుడి దుర్మరణం చెందాడు. వర్షం కురవడంతో మార్గమధ్యలో ఈయన వాహనం అదుపు తప్పి పడటంతో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం తొక్కేసి పరారైంది. పలాస–కాశీబుగ్గ చేరుకుంటూ ప్రమాదానికి గురయ్యాడు. మందస మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన కొంచాడ కార్తీక్‌(28) సోమవారం మధ్యాహ్నం తన గ్రామం నుంచి జాతీయ రహదారిపై వస్తుండగా బొడ్డపాడు గ్రామ అడ్డురోడ్డు(యాపాడు చెరువు)లో వర్షం కురుస్తోంది.

ఈ క్రమంలో బుల్లెట్‌ అదుపు తప్పి బోల్తా పడ్డాడు. హెల్మెట్‌ ధరించి ఉన్నప్పటికీ, ఈయన శరీరంపై వాహనం వెళ్లడంతో తల ఛిద్రమయ్యింది. అప్పటికే వర్షం కురుస్తుండటంతో రోడ్డంతా రక్తసిక్తమైంది. స్థానికులు గుర్తించి 108 కు సమాచారం అందించారు. ఇదేక్రమంలో కాశీబుగ్గ పోలీసులు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాతీయ రహదారిపై లారీలను తప్పించబోయి స్కిడ్‌ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనకు కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు వెంటనే అటు లక్ష్మీపురం టోల్‌గేటు, ఇటు పెట్రోలింగ్‌ సిబ్బందిని అప్రమత్తం చేసినా ప్రయోజనం లేకపోయింది. అనంతరం మృతదేహాన్ని పలాస సామాజిక ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సువర్ణాపురంలో విషాద ఛాయలు
మందస: మండలంలోని సువర్ణాపురం గ్రామానికి చెందిన కొంచాడ భీమారావు, భవానీ దంపతుల పెద్ద కుమారుడు కార్తీక్‌(28) మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయనకు తమ్ముడు గీతాకృష్ణ, చెల్లి క్రాంతి ఉన్నారు. హృదయ విదారకంగా విలపిస్తున్న వీరిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ఈయన ఐటీఐ చదువుకుని, పలు చోట్ల చిరుద్యోగిగా చేశాడు. సరైన ఆదాయం లేకపోవడంతో ఇంటి దగ్గర తండ్రి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఆర్మీలో పని చేస్తున్న స్నేహితుడు తలగాన తారకేశ్వరరావు వస్తున్నాడని సమాచారంతో పలాస వెళ్లి ఆయన్ను తీసుకువచ్చాడు. మళ్లీ పలాస వైపు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వాస్తవానికి మృతుడి కుటుంబానికి ఇతర వాహనాలు ఉన్నాయి. అయినప్పటికీ సరదాగా బుల్లెట్‌ తీసుకెళ్లాడు. 

మరిన్ని వార్తలు