గర్ల్‌ఫ్రెండ్‌ ఇంటి ఎదుట ప్రియుడి విషాదాంతం

22 Sep, 2019 13:31 IST|Sakshi

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తాను ప్రేమించిన యువతి ఇంటి ఎదుటే ప్రేమికుడు సజీవ దహనమైన ఘటన మహరాజ్‌గంజ్‌లో వెలుగుచూసింది. ఆర్యచౌక్‌ ప్రాంతంలో బసంత్‌పూర్‌కు చెందిన 23 ఏళ్ల కిషన్‌ ఆర్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. కిషన్‌ తన ప్రియురాలు కలిసి ఉండేవారని, పదిరోజుల కిందట వీరిద్దరూ గొడవపడటంతో యువతి పట్టణంలోని ఫరెందా రోడ్డు సమీపంలోని తన పుట్టింటికి వచ్చిందని ఏఎస్‌పీ వెల్లడించారు. మరోవైపు యువతి కుటుంబ సభ్యులే కిషన్‌ను సజీవ దహనం చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే కిషన్‌ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని లైటర్‌తో నిప్పంటించుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారని ఎసీపీ చెప్పారు.

కిషన్‌ను కాపాడే ప్రయత్నంలో యువతి తండ్రికి కూడా గాయాలయ్యాయి. జిల్లా ఆస్పత్రిలో గాయపడిన యువతి తండ్రిని చేర్పించామని పోలీసులు తెలిపారు. సజీవ దహనానికి పాల్పడిన కిషన్‌ యువతి ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నారు. కాగా మృతదేహాన్ని గుర్తించని యువతి ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని చెప్పడం గమనార్హం. రెండేళ్ల కిందట తన గర్ల్‌ఫ్రెండ్‌ మైనర్‌గా ఉన్న సమయంలో ఆమెతో కలిసి పారిపోగా, ఆమె తండ్రి ఫిర్యాదుపై కిషన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మరోసారి అదే యువతితో వెళ్లిపోయాడు.

మరిన్ని వార్తలు