-

క్వారీ నీటిగుంతలో పడి ప్రమాదం

14 Oct, 2019 08:46 IST|Sakshi
క్వారీ నీటిగుంతలో పడి మృతి చెందిన  బుద్ధారాం  

సాక్షి, పులిచెర్ల(చిత్తూరు) : క్వారీ నీటిగుంతలో బట్టలు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు కుమార్తెలు కాలుజారి గుంతలో పడడం గుర్తించిన తండ్రి వారిని రక్షించబోయి తాను అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం పులిచెర్ల మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన బుద్ధారాం(46) భార్య, ముగ్గురు కుమార్తెలతో కలిసి పులిచెర్ల మండలం రెడ్డివారిపల్లె పంచాయతీ ముప్పిరెడ్డిగారిపల్లె వద్ద నుంచి క్వారీలో రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఖాళీగా ఉన్నామని బుద్ధారాం ముగ్గురు కుమార్తెలు సుకుమతి(13), లీక్మీ(18), కేసి(19) క్వారీ గుంతలో బట్టలు ఉతకడానికి దిగారు. ఈ క్రమంలో ఒకరు కాలుజారి గుంతలో పడడంతో ఒకరినొకరు రక్షించుకోబోయి అందరూ గుంతలో మునిగిపోయారు. ఇది గుర్తించిన తండ్రి బుద్ధారాం, మరికొందరు నీటిలోకి దిగారు. ముగ్గురు ఆడపిల్లల్ని గట్టుకు చేర్చారు. వారికి ప్రాథమిక చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే ఈతరాక నీటిలో మునిగిపోయిన బుద్ధారాంను ఎవరూ గుర్తించలేకపోయారు. గుర్తించిన వెంటనే నీటిలో దిగి అతన్ని బయటికి తీశారు. అయితే అప్పటికే  అతను మృతి చెందాడు. సమాచారాన్ని కల్లూరు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బుద్ధారాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. 

మరిన్ని వార్తలు