ప్రాణం తీసిన ఈత సరదా

25 Nov, 2019 08:16 IST|Sakshi

అక్కిరెడ్డిపాలెం (గాజువాక): ఈత సరదా ప్రాణం తీసంది. ఉడా పార్క్‌ బీచ్‌లో స్నానానికి దిగిన ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. మూడో పట్టణ పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ పనులు చేసుకునే ఎస్‌.కోటకు చెందిన ఎల్లపు ఎర్రినాయుడు, జగదీశ్వరి దంపతులకు ఎల్లపు రోహిత్‌ (19), హర్షిత్‌ ఇద్దరు కుమారులు. వీరిలో రోహిత్‌ గిడిజాల వద్ద ఉన్న సాయి గణపతి కళాశాలలో పాలిటెక్నికల్‌ ఈసీఈ పూర్తి చేశాడు. రెండో కుమారుడు హర్షిత్‌ గాజువాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. ఇద్దరు అన్నదమ్ములకు చదువుపై ఉన్న ఇష్టంతో అక్కిరెడ్డిపాలెంలోని పెద్దమ్మ, పెదనాన్నలైన కాండ్రేగుల రత్నం, నర్సింగరావుల వద్ద ఉండి చదువుకుంటున్నారు. రోహిత్‌ ఉన్నత చదువులు కోసం సిద్ధమవుతున్నాడు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఇంటిలో చెప్పకుండా రోహిత్‌ బయటకు వెళ్లాడు. అక్కడి నుంచి పంతులు గారి మేడ ప్రాంతానికి చెందిన జి.సంతోష్‌(22), అనకాపల్లికి చెందిన జి.స్వామి(21)తో కలిసి మధ్యాహ్నం నగరంలోని ఉడా పార్క్‌కు వెళ్లారు. వీరిలో ఎవరికీ ఈత రాకపోయినప్పటికీ రోహిత్‌ మాత్రం స్నానానికి దిగాడు. మిగిలిన ఇద్దరు స్నేహితులు ఒడ్డునే ఉన్నారు. స్నేహితులిద్దరూ చూస్తుండగానే బలమైన కెరటాల తాకిడికి రోహిత్‌ గల్లంతయ్యాడు. కొద్ది సమయానికి రోహిత్‌ మృతదేహం ఒడ్డుకు చేరింది. రోహిత్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోహిత్‌ మధ్యాహ్నం భోజనానికి రాకపోవడంతో అతని సోదరుడు హర్షిత్‌ ఫోన్‌ చేయగా... రోహిత్‌ ఉడా పార్కు వెనుక ఉన్న సముద్రంలో గల్లంతయ్యాడన్న విషయం తెలిసింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు, బంధువులు తీరానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. చేతికందొచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. త్రీటౌన్‌ ఎస్‌ఐ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు