విశ్వకర్మ పూజలో విషాదం

18 Sep, 2019 09:26 IST|Sakshi
విరాట్‌ మృతదేహం

విద్యుత్‌ షాక్‌తో విద్యార్థి మృతి

కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు, సోదరి

జింకిభద్రలో విషాదఛాయలు

సాక్షి, సోంపేట (శ్రీకాకుళం): పట్టణంలోని నిర్వహించిన విశ్వకర్మ పూజలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షాక్‌తో జింకిభద్ర గ్రామానికి చెందిన కాశి విరాట్‌ (19) మృతి చెందడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో నిశ్శబ్ద వాతవరణం నెలకొంది. విరాట్‌ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పూజా కార్యాక్రమాలు ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. సోంపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పలువురు భవన నిర్మాణ, బంగారం ఆభరణాలు తయారీ, ఇతర రంగాల్లో విధులు నిర్వహించే కార్మికులు మంగళవారం నుంచి విశ్వకర్మ పూజలు కవిటి రహదారిలోని శైలాజ కల్యాణ మండపం సమీపంలో ప్రారంభించారు. గత పదిహేను రోజులగా విరాళాలు సేకరించి విగ్రహం తయారు చేశారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాదాన్ని స్వామి వారికి నివేదించారు.

స్వామివారికి ప్రసాదం పెట్టిన తర్వాత కొద్ది సమయం మండపం షట్టర్‌ వేయమని విరాట్‌కు అక్కడున్నవారు సూచించారు. విరాట్‌ షట్టర్‌ వేస్తూ ఒక్కసారి విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. అక్కడ అమర్చి ఉన్న విద్యుత్‌ తీగ తెగి ఉండడంతో షాక్‌కు గురైనట్లు భావిస్తున్నారు. షట్టర్‌కు అంటుకు పోవడంతో విరాట్‌ను బయటకు తీయడానికి తండ్రి కాశి ఉమామహేశ్వరరావు, తదితరులు ప్రయత్నించారు. షాక్‌ విడిచిపెట్టకపోవడంతో వెంటనే ఫీజు తొలగించారు. విద్యుత్‌ షాక్‌ వదలడంతో పక్కనే ఉన్న గోడపై విరాట్‌ పడ్డాడు. తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దగ్గర్లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి వెంటనే తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

వృత్తిలో విరాటే..
విరాట్‌ తండ్రి వడ్రంగి పని చేస్తూ శైలజ కల్యాణ మండపం సమీపంలో షాపు నిర్వహిస్తూ జీవనాధారం సాగిస్తున్నారు. ప్రస్తుతం చేతి పని కూడా కంప్యూటర్‌ ద్వారానే కొనసాగుతుంది. తలుపులు, కప్‌ బోర్డులు కంప్యూటర్‌ ద్వారా డిజైనింగ్‌  చేయడంలో విరాట్‌ ఆరితేరాడు. చదువులో రాణిస్తూనే తండ్రికి పనిలో కూడా సహాయం చేసేవాడు.

విషాదంలో కుటుంబం..
కళ్ల ముందే కుమారుడు విలవిల్లాడినా కాపాడుకోలేని పరిస్థితి తనదని తండ్రి రోదించాడు. కాశి ఉమామహేశ్వరరావు, గీత దంపతులకు కుమారుడు విరాట్, కుమార్తె శ్రావణి ఉన్నారు. కుమారుడు విరాట్‌ సోంపేట పట్టణంలోని సంస్కారభారతి కళాశాలలో బీఎస్సీ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం నుంచి పూజా ప్రాంగణంలోనే ఉన్నాడని, అన్నీతానై వ్యవహరించడాని, తల్లిదండ్రులు, చెల్లి కళ్లదుటే ఈ ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు   రోదిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనను ఆపడం ఎవరితరమూ కావడం లేదు. విరాట్‌ మృతి వార్త తెలియడంతో సోంపేట పట్టణంతో పాటు, జింకిభద్ర గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కళాశాలకు చెందిన తోటి స్నేహితులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సోంపేట సామాజిక ఆస్పత్రిలో శవపంచనామా  నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. సోంపేట ఎస్‌ఐ కె.వెంకటేశ్‌  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు