భయపడి.. గుండె ఆగి..!

11 Apr, 2020 07:54 IST|Sakshi

సాక్షి, తుళ్లూరు రూరల్‌ (తాడికొండ): పోలీసులు వస్తున్నారన్న ఆందోళనతో పారిపోయే క్రమంలో గుండె ఆగి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో శుక్రవారం జరిగింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాయపూడి గ్రామస్తులు ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్లపై తిరుగుతున్నారని తెలియడంతో గస్తీ తిరుగుతున్న పోలీసులు అక్కడకు వెళ్లారు. వారిని  చూసిన గ్రామస్తులు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన జాఫర్‌(60) కుప్పకూలి పడిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. చదవండి: చిల్లర రాజకీయాలు చేయకు ‘బాబూ’

అతను కొంత కాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు కుమారుడు సద్దాం హుస్సేన్‌ పేర్కొన్నారు. పోలీసులు వస్తున్నారన్న భయంతోనే పొలాల్లోకి పరుగు తీస్తూ కింద పడి మరణించాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుళ్లూరు సీఐ శరత్‌బాబు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మండలంలోని నెక్కల్లు గ్రామానికి చెందిన ఆలూరి ఫణింద్ర(33) శుక్రవారం తెల్లవారుజామున తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  

గుండెపోటుతోనే జాఫర్‌ మృతి: డీఎస్పీ    
తుళ్లూరు: గుండెపోటుతోనే జాఫర్‌ మృతి చెందినట్లు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఆయన  విలేకరులతో మాట్లాడారు. పోలీసులు రావడంతో గ్రామంలో చెట్ల కింద కూర్చున్న కొంత మంది భయంతో పొలాల్లోకి పరిగెత్తారన్నారు. వారిలో షేక్‌ జాఫర్‌  కంగారులో గుండెపోటుతో మృతి చెందినట్టు ఆయన వివరించారు. 

మరిన్ని వార్తలు