డ్రంకన్‌ డ్రైవ్‌ టెస్టు.. పోలీసులకు ట్విస్టు

10 Jul, 2018 13:07 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న బుల్లెట్‌ వాహనం

కోర్టులో హాజరు పరిచేందుకు ప్రయత్నిస్తుండగా పరార్‌

తీగలాగి డొంక కదిలించారు..

బుల్లెట్‌తో సహా రెండు పల్సర్లు స్వాధీనం

పాత నేరాల చిట్టా వెలుగులోకి..

గుంటూరు, నరసరావుపేటటౌన్‌: తీగ లాగితే డొంక కదిలిందన్న సామెతను గుర్తు చేస్తోంది ఈ సంఘటన. దర్జాగా మద్యం తాగి జోరుగా హుషారుగా బుల్లెట్‌ వాహనంపై షికారు చేస్తున్న ఓ యువకుడి గుట్టును పోలీసులు రట్టు చేశారు. తీరా ఆరా తీస్తే ద్విచక్రవాహనాల చోరీలు చేసి జల్సా జీవితాన్ని అనుభవిస్తున్న యువకుడిగా గుర్తించి విస్మయానికి గురయ్యారు. వివరాల్లోకి వెళితే... గత మూడురోజుల కిందట టూటౌన్‌ పోలీసులు సత్తెనపల్లిరోడ్డు ఆవులసత్రం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఓ యువకుడు బుల్లెట్‌పై వస్తుండగా పోలీసులు ఆపారు. ఆ యువకుడిపై అనుమానం వచ్చి బ్రీత్‌ ఎనలైజర్‌ ద్వారా పరీక్షించగా, మద్యం తాగి ఉన్నట్లుగా గుర్తించి వాహనాన్ని అదుపులోకి తీసుకొని వాహనానికి సంబంధించిన పత్రాలతో మరుసటిరోజు స్టేషన్‌కు రావాలని ఆదేశించారు.

వచ్చిన యువకుడిని కోర్టు ఎదుట హాజరుపర్చేందుకు ప్రయత్నిస్తుండగా ఆ యువకుడు పోలీసుల కళ్లుగప్పిపరారయ్యాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న నంబరు ఆధారంగా వివరాలు సేకరించగా, గుంటూరుకు చెందిన దొంతిరెడ్డి సాయిచంద్రారెడ్డికి సంబంధించిన వాహనంగా గుర్తించారు. అతడిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల కిందటే తన వాహనం చోరీకి గురైందని, వాహనం కోసం తాను గాలిస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో తాము పట్టుకున్నది ఓ చోరుడినని గుర్తించి అతని కోసం గాలింపు చేపట్టారు. దొరికిన సీసీ పుటేజ్‌ పరిశీలించి, దాని ఆధారంగా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన శివగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మరో రెండు పల్సర్‌ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పిడుగురాళ్ల, శావల్యాపురంలో చోరీ చేసినట్లుగా విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.

పోలీసుల పేరుతో బెదిరింపు
పోలీసులు అదుపులో ఉన్న శివ ద్విచక్రవాహనాల చోరీలతో పాటు ఇటీవల కాలంలో పోలీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడి యువకుల వద్ద సెల్‌ఫోన్, నగదు తీసుకున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైనట్లు తెలియవచ్చింది. పాలపాడురోడ్డు, రైల్వేస్టేషన్‌ సమీపంలో  ఒంటరిగా ఉన్న యువకుల వద్దకు వెళ్లి తాను పోలీసునని చెప్పి వారి వద్ద నుంచి ఫోన్‌లు లాక్కున్నట్లు తెలిసింది. సెల్‌ ఫోన్‌ పోగొట్టుకున్న బాధితుల్లో ఒకరు ఇప్పటికే టూటౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మరో ఇద్దరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు