ఫైనాన్స్‌ పేరుతో మోసం.. కోటిన్నరతో పరార్‌

14 Dec, 2019 08:20 IST|Sakshi
 మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావుకు మొరపెట్టుకుంటున్న బాధితులు 

చిట్టీలు, వైన్స్‌లో షేర్‌పేరుతో 40 మంది దగ్గర అప్పులు

నాలుగు నెలలుగా లభించని ఆచూకీ

పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ

సాక్షి, వెల్గటూరు(ధర్మపురి): కోటిన్నర మేర అప్పులు చేసిన లిక్కర్‌ వ్యాపారి పరార్‌ అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ధర్మారం టౌన్‌కు చెందిన వ్యక్తి చిట్టీలు, ఫైనాన్స్‌ నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి అత్యవసర పరిస్థితిలో రూ.లక్ష అయినా ఉన్నఫలంగా ఇచ్చేవాడు. ఇలా ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్నాడు. ప్రజల అత్యాశను ఆసరా చేసుకుని అధిక వడ్డీ ఇస్తానని, వైన్స్‌లో షేరు ఇస్తానని చెప్పి çసుమారు 40 మంది దగ్గర రూ.కోటిన్నర వరకు చిట్టీలు అప్పులు తెచ్చి ఉడాయించిన విషయం వెల్గటూర్, ధర్మారం మండలాల్లో సంచలనం రేపింది. బాధితులు మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావును కలసి మొరపెట్టుకున్నారు. డబ్బు ఇచ్చిన వారంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు.

వెల్గటూరు మండలం పాతూగూడూరు గ్రామానికి చెందిన వ్యక్తి ఐదేళ్లక్రితం ఇక్కడికి వచ్చాడు. ధర్మారం మండలకేంద్రంలో లిక్కర్, ఫైనాన్స్‌ వ్యాపారంలో స్థిరపడ్డాడు. మార్కెట్‌లో మంచిపేరు తెచ్చుకున్నాడు. ధర్మారంలో వీరి గ్రూపు వైన్స్‌ ఏర్పాటు చేయగా అందులో షేర్‌ ఇస్తామని నమ్మించి అప్పులు తెచ్చాడు. చిట్టీలు ఇవ్వకుండా అతడి వద్దే ఉంచుకుని వడ్డీకి ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు. నగదు ఇచ్చిన వారు సుమారు 40 మంది వరకు ఉన్నారు. వీరి నుంచి రూ.1.5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. వైన్స్‌ గడువు దసరాతో ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి డబ్బు కావాలని ఒత్తిడి పెరిగింది. దీంతో సెప్టెంబర్‌ 13న ధర్మారం నుంచి అర్ధరాత్రి బిచానా ఎత్తేశాడు. బాధితులు కొన్నినెలల నుంచి ఆందోళన చెందుతున్నారు. 

అంతా పేదవారే...
బాధితులంతా పేదవారే. రాజారాంపల్లి గ్రామానికి చెందిన రాకేశ్‌ అనే యువకుడి తల్లి చనిపోగా బీమా డబ్బు రూ.5లక్షలు వచ్చాయి. అకౌంట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్న రెండురోజులకే కనిపించకపోయాడు. సూరారాంకు చెందిన మాదాసు రాములు ,ఆత్మకూరుకు చెందిన లచ్చన్న,సంతోశ్‌ ,రూ.5లక్షలు ,రూ12 లక్షలు ఇచ్చిన వారున్నారు. కూరగాయలు అమ్మి కూడబెట్టుకున్న సొమ్ము రూ.12లక్షలు తీసుకున్నాడని పాతగూగూరు గ్రామానికి చెందిన పొనుగోటి శ్యామల రోదిస్తూ తెలిపింది. కూతురు పెళ్లి కోసమని రూ.10 లక్షలు కూడబెట్టా, డబ్బు రాకపోతే మరణమే శరణ్యమని మరో బాధితుడు వాపోయాడు.

మాజీ ఎంపీపీకి మొరపెట్టుకున్న బాధితులు 
పాతగూడూరులోని వ్యాపారి తల్లిదండ్రి, భార్యాపిల్లలు నివాసం ఉంటున్నారు. అతడు నాలుగునెలలుగా కనిపించలేదు. ఇన్నాళ్లు వేచి ఉన్న బాధితులు అంతాకలసి గురువారం పాతగూడురుకు వచ్చిన మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావును న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. వ్యాపారి తండ్రి బొల్లం మల్లయ్యను పిలిచి బాధితులకు ఎలాగైనా న్యాయం చేయాలని మాజీ ఎంపీపీ సూచించారు. కుమారుడి జాడకోసం తండ్రిపై బాధితలు ఒత్తిడి పెంచారు. అతడి భూములు దున్నకుండా అడ్డుకుంటున్నారు. అయితే అప్పులు ఇచ్చేప్పుడు నాకెవ్వరూ చెప్పలేదని నేనెలా బా«ధ్యుడనని తండ్రి తప్పించుకుంటున్నాడు. తనకున్న ఆస్తిలో సగం రాసిస్తానని చెప్పుకొచ్చాడు. ఆస్తి మొత్తం ఇచ్చి నా తీసుకున్న డబ్బుల్లో 20 శాతం కూడా తీరవని బాధితులు వ్యాపారి తండ్రిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరువర్గాలను మాజీ ఎంపీపీ శాంతిపజేశారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. చివరికి పంచాయితీ స్టేషన్‌కు చేరినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు