4 కిలోల బంగారం దొంగ అరెస్టు

29 Apr, 2018 09:17 IST|Sakshi

కటక్‌లో దొరికిన నిందితుడు

3 కిలోల బంగారం, 6 డైమండ్లు స్వాధీనం

సాక్షి, నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌అర్బన్‌): వారం రోజుల క్రితం నాలుగు కిలోల బంగారంతో ఉడాయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 3.05 కిలోల బంగారం, 6 డైమండ్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌బెంగాల్‌ హుగ్లీ జిల్లా కుల్లత్‌ గ్రామానికి చెందిన భూపాల్‌ మన్నా ఆర్మూర్‌లో స్థిరపడ్డాడు. బంగారు అభరణాలు తయారు చేస్తూ, నమ్మకంగా ఉండడంతో బంగారు వ్యాపారులు కిలోల కొద్ది బంగారం ఇచ్చి అభరణాలు చేయించుకునే వారు. ఇలా ఆర్మూర్, నందిపేట్, నిర్మల్‌ ప్రాంతాలకు చెందిన బంగారు వ్యాపారులు కలిసి నాలుగు కిలోల బంగారాన్ని ఇచ్చారు.

పెద్ద మొత్తంలో బంగారం అతని వద్ద ఉండటంతో భూపాల్‌కు దురాలోచన కలిగింది. దీంతో నాలుగు రోజుల క్రితం బంగారంతో ఉడాయించాడు. అయితే, ఆభరణాలు చేయాలని బంగారం ఇచ్చిన జక్రాన్‌పల్లి మండలం మునిపల్లికి చెందిన వ్యాపారి ఆరే శివకుమార్‌ ఈ నెల 23న వెళ్లగా షాప్‌ మూసి ఉంది. మిగతా వ్యాపారులు కూడా అక్కడకు చేరుకోవడంతో భూపాల్‌ ఉడాయించినట్లు తేలింది. శివకుమార్‌ ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆర్మూర్‌ ఏసీపీ శివకుమార్‌ పర్యవేక్షణలో టౌన్‌ సీఐ సీతారాం, ఎస్సై గోపీ ఆధ్వర్యంలో హెడ్‌ కానిస్టేబుల్‌ రాములు, కానిస్టేబుల్‌ మల్లేశ్‌ నాగ్‌పూర్‌ వెళ్లారు.

నిందితుడు కటక్‌ వెళ్లినట్లు గుర్తించి అతడ్ని పట్టుకున్నారు. పోలీసుల ఎదుట తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇతడ్ని అరెస్టు చేసే ముందు ఆర్మూర్‌ పోలీసులు కటక్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట శుక్రవారం హాజరు పరిచారు. అనంతరం అరెస్టు చేసి శనివారం ఆర్మూర్‌కు తీసుకువచ్చారు. నిందితుడి నుంచి 3.05 కిలో బంగారు అభరణాలు, 6 డైమండ్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు