టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తానని.. బైక్‌తో పరార్‌

30 Apr, 2019 11:19 IST|Sakshi
నిందితుడు, బైక్‌లతో సీఐ రామలింగమయ్య, ఎస్‌ఐ ఖాన్, సిబ్బంది

నిందితుడు అరెస్ట్‌

మూడు బైక్‌లు స్వాధీనం

ప్రొద్దుటూరు క్రైం : ‘బ్రదర్‌ మీ బైక్‌ చాలా బాగుంది.. ఎంతకు తీసుకున్నారు..? నేను ఇలాంటి బైక్‌ తీసుకోవాలనుకుంటున్నాను.. టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తాను.. మీ బైక్‌  ఇస్తారా’.. అంటూ బైకు తీసుకుంటాడు.. అంతే.. బైక్‌తో వెళ్లిన అతను ఇక తిరిగిరాడు. ఇలా ప్రొద్దుటూరుతో పాటు కడపలో బైక్‌లను దొంగలించిన దుర్గం దివాకర్‌ను వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.  వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం సీఐ రామలింగమయ్య అరెస్ట్‌ వివరాలను వెల్లడించారు. పట్టణంలోని ఈశ్వరరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న దివాకర్‌ 7వ తరగతి వరకు చదువుకున్నాడు. అతనికి తండ్రి లేడు. తల్లి ఉన్నా అతనికి దూరంగా ఉంటోంది. దీంతో అతను అవ్వా, తాత వద్ద ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన దివాకర్‌ చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డారు. నిద్రిస్తున్న సమయంలో వారి చేతిలో ఉన్న  ఉంగరాలను చాక చక్యంగా దొంగిలించుకొని వెళ్లేవాడు. ప్రొద్దుటూరు, కడపలో అతనిపై చోరీ కేసులు ఉన్నాయి. తర్వాత బైక్‌లను దొంగిలించాలనే ఆలోచన అతనికి వచ్చింది.

గ్రౌండ్లలో పార్కింగ్‌ చేసిన బైక్‌లే టార్గెట్‌
సాయంత్రం సమయాల్లో పాఠశాల, కళాశాల మైదానాలకు వెళ్లి అక్కడ పార్కింగ్‌ చేసిన బైక్‌లను దివాకర్‌ ఎంపిక చేసుకుంటాడు. బైక్‌ యజమానిని గుర్తించి అతని వద్దకు వెళ్తాడు. ‘అన్నా మీ బైక్‌ బాగుంది.. ఎంతకు కొన్నారు..? నేను ఇలాంటి బైక్‌ను కొనాలనుకుంటున్నాను.. బండి ఎలా ఉందో డ్రైవ్‌ చేసి ఇస్తాను ఇస్తారా’.. అని వారిని బతిమాలతాడు. తనపై వారికి నమ్మకం కుదిరేలా తన డొక్కు బైక్‌ను అక్కడే వదిలేసి వెళ్తాడు. ఈ క్రమంలో ప్రొద్దుటూరులోని వైఎంఆర్‌ కాలనీకి చెందిన  ఎం ప్రసాద్‌ అనే వ్యక్తి తన హోండా షైన్‌ను గుర్తు తెలియని ఒక యువకుడు తీసుకెళ్లాడని ఈ నెల 28న వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ ఎస్‌ఐ ఎంఏ ఖాన్‌ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

నిందితుడు దివాకర్‌ రామేశ్వరంలోని శివాలయం వద్ద ఉన్నాడని సమాచారం రావడంతో ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి వెళ్లి సోమవారం అతన్ని అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి హోండా షైన్, టీవీఎస్‌ అపాచీ, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ను స్వా«ధీనం చేసుకున్నారు. ఈ నెల 24న కడపలోని ఐటీఐ సర్కిల్‌ వద్ద ఆపాచీ, 25న కమలాపురం మండలం, అప్పాయపల్లి వద్ద రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను దొంగిలించినట్లు అతను పోలీసుల వద్ద అంగీకరించాడు. నిందితుడి అరెస్ట్, వాహనాల రికవరీలో మంచి ప్రతిభ కనబరచిన ఎస్‌ఐ ఎంఏ ఖాన్, కానిస్టేబుళ్లు మహేష్, సింహరాయుడును సీఐ రామలింగమయ్య అభినందించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు