చంపేసి.. కాల్చేశారు

21 Sep, 2019 10:05 IST|Sakshi
కిషన్‌ (ఫైల్‌); కిషన్‌ కూతురు మీనాక్షి, కొడుకు అరుణ్‌

పాతకక్షలతో వ్యక్తి దారుణ హత్య

గొడ్డళ్లు, కొడవలితో దాడి; మృతదేహం పూడ్చివేత..

ఇబ్రహీంపట్నం ఠాణాలో మిస్సింగ్‌ కేసు నమోదు

వివరాలు వెల్లడించిన ఏసీపీ యాదగిరిరెడ్డి

సాక్షి, ఇబ్రహీంపట్నం: పాత కక్షల నేపథ్యంలో సొంత బంధువులే ఓ వ్యక్తిని కిరాతంగా హత్య చేసి మృతదేహాన్ని కాల్చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్టేషన్‌ పరిధిలో శుక్రవారం అలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. ఏసీపీ యాదగిరిరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. హయత్‌నగర్‌కు చెందిన జక్కుల కిషన్‌(42) భార్య గతంలో చనిపోయింది. ఈయనకు ఇంటర్‌ చదువుతున్న కూతురు మీనాక్షి, పదో తరగతి చదువుతున్న కుమారుడు అరుణ్‌ ఉన్నాడు. కిషన్‌ కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నాడు. ఇతడికి పొల్కంపల్లి అనుబంధ గ్రామాలైన మాన్యగూడ, నెర్రపల్లిలో ఉన్న బంధువులతో పాతకక్షలు, గొడవలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈక్రమంలో అతడు గత నెల 31న చుట్టాల వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరి తిరిగి రాలేదు. దీంతో ఆయన కూతురు మీనాక్షి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 6న ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

జరిగింది ఇదీ.. 
మాన్యగూడకు చెందిన గునుకుల ఐలయ్య కిషన్‌కు ఫోన్‌ చేసినట్లు కాల్‌డేటా ద్వారా పోలీసులు గుర్తించారు. ఈమేరకు ఐలయ్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేపట్టగా కిషన్‌ హత్యకు సంబంధించిన వివరాలు తెలిపాడు. కుటుంబ గొడవలు, పాతకక్షల నేపథ్యంలో కిషన్‌ను హతమార్చాలని ఐలయ్యతో తన కుమారులు సురేష్, నరేష్, అల్లుడు కృష్ణతోపాటు బంధువులైన నెర్రపల్లికి చెందిన శేఖర్, శ్రీశైలం, నరేష్‌తో కలిసి పథకం పన్నాడు. గత 31న కిషన్‌ నెర్రపల్లికి వచ్చాడని తెలుసుకున్న వీరు మాన్యగూడకు రావాలని చెప్పారు. దీంతో స్కూటర్‌పై రాత్రిపూట బయలుదేరిన కిషన్‌ను దారి కాచి గొడ్డళ్లు, కొడవళ్లు, కర్రలతో దాడిచేసి అతి కిరాతకంగా హతమార్చారు. అనంతరం రాయపోల్‌ గ్రామ సమీపంలోని ఓ వెంచర్‌లో తీసిన ఓ కందకంలో మృతదేహాన్ని పడేసి పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. మరుసటి రోజు తిరిగి అక్కడికి వచ్చి మట్టితో కప్పేశారు. విచారణలో భాగంగా ఐలయ్య ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కిషన్‌ మృతదేహాన్ని వెలికితీశారు. దాదాపు 20 రోజుల క్రితం మృతదేహాన్ని తగులబెట్టి పూడ్చివేయడంతో కేవలం కిషన్‌ అస్థిపంజరం మాత్రమే మిగిలింది. తహాసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐ గురువారెడ్డి సమక్షంలో ప్రభుత్వ వైద్యుడు హనుమంతురావు  పోస్టుమార్టం నిర్వహించారు.   

కన్నీరుమున్నీరైన పిల్లలు  
కిషన్‌ హత్యతో పిల్లలు మీనాక్షి, అరుణ్‌తోపాటు బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. గతంలో తల్లి మృతి, ప్రస్తుతం తండ్రి హత్యతో పిల్లలు అనాథలయ్యారు. కిషన్‌ నిందితుడు ఐలయ్య చిన్నమ్మ కుమారుడు. పాత కక్షల నేపథ్యంలో అతడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.    

పరారీలో నిందితులు  
కిషన్‌ హత్యలో ఏడుగురికి సంబంధం ఉందని, ఐలయ్యను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ యాదగిరిరెడ్డి తెలిపారు. ప్రత్యేక బృందాలతో మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలో పట్టుకుంటామని తెలిపారు. మిస్సింగ్‌ కేసును హత్య కేసుగా మార్చామని పేర్కొన్నారు. హత్యకు గల పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.   

మరిన్ని వార్తలు