టపాసులు పేల్చినందుకు వ్యక్తి దారుణ హత్య

28 Oct, 2019 14:47 IST|Sakshi

భువనేశ్వర్‌ : దీపావళి పండగ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఎంతో సంబరంగా టపాసులు కాల్చుతున్న ఓ వ్యక్తికి ఆ సంతోషమే చివరి క్షణాలుగా మారాయి. టపాసులు కాల్చొద్దు అన్న మాట పట్టించుకోనందుకు కొంతమంది చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. రాజధాని సమీపంలోని సుందర్‌పాడ ప్రాంతంలో అమరేశ్‌ నాయక్‌ తన స్నేహితులతో కలిసి ఇంటి ముందు టపాసులు పేల్చుతున్నాడు. బాణాసంచా కాల్చుతుండగా ఆ దారిలో వెళ్తున్న కొంత మంది అమరేశ్‌ వద్దకు వచ్చి టపాకాయలు కాల్చనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. అది ఇరు వర్గాల మధ్య గొడవకు దారి తీయగా.. కోపానికి గురైన 15 మంది వ్యక్తులు మూకుమ్మడిగా అమరేశ్‌పై పదునైన ఆయుధాలతో దాడికి దిగారు. దీంతో సదరు వ్యక్తి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు  అమరేశ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా అతన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆ వ్యక్తి చనిపోయినట్లు తెలిపారు. 

దీపావళి నాడు జరిగిన ఘటనల్లో పలు ప్రాంతాల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. కియోంజార్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి దీపావళి పటాసులు కాల్చుతున్న క్రమంలో ఇంట్లో మంటలు చెలరేగడంతో మరణించగా, భద్రక్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇంటిని అలంకరించే సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు