చోరీ.. అతని హాబీ

13 Mar, 2020 09:06 IST|Sakshi

20 రోజుల్లో రెండు ద్విచక్ర వాహనాల చోరీ

తాగి డ్రైవ్‌ చేస్తూ చిక్కి ఒకటి వదిలేశాడు

మరో వాహనంపైనగర వ్యాప్తంగా చక్కర్లు

అదుపులోకి తీసుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, సిటీబ్యూరో: మద్యం మత్తులో చోరీ చేసిన వాహనంపై తిరుగుతున్న ఓ ఘరానా దొంగ.. ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ డ్రైవింగ్‌ (డీడీ) పరీక్షల్లో చిక్కాడు. దీంతో ఆ వాహనాన్ని ఠాణాలోనే వదిలేసిన అతగాడు మరోటి దొంగతనం చేసి చక్కర్లు కొడుతున్నాడు.ఈ సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు గురువారం వెల్లడించారు. ఇతగాడు గతంలో తనను పట్టుకోవడానికి ప్రయత్నించిన సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) కానిస్టేబుల్‌పై హత్యాయత్నం చేశాడు. హయత్‌నగర్‌ సమీపంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన మహ్మద్‌ సమీర్‌కు అష్వఖ్, గోలీ అనే మారుపేర్లూ ఉన్నాయి. ఏళ్ళుగా నేరాలు చేస్తున్న ఇతగాడిపై ఇప్పటి వరకు దోపిడీలు, స్నాచింగ్స్, వాహనచోరీలతో కలిపి మొత్తం 29 కేసులు ఉన్నాయి.  పదేళ్ళ క్రితం ఓ దోపిడీ కేసుకు సంబంధించి తనను పట్టుకోవడానికి ప్రయత్నించిన సైబరాబాద్‌ (ఉమ్మడి) ఎస్‌ఓటీ పోలీసు కానిస్టేబుల్‌పై హత్యాయత్నం చేశాడు.

ఈ కేసులో ఇతగాడికి ఏడేళ్ళ జైలు శిక్షపడింది. గోలీపై జీడిమెట్ల, దుండిగల్, బాలానగర్, బోయిన్‌పల్లి సహా అనేక పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఇతగాడు అరెస్టు అయినప్పుడు బెయిల్‌ తీసుకోడు. పోలీసులు కోర్టులో హాజరుపరిచినప్పుడు తన నేరం అంగీకరించి (ప్లీడెడ్‌ గిల్టీ) నేరుగా జైలు శిక్ష అనుభవించి బయటకు వస్తాడు. ఈ నేపథ్యంలోనే 49 ఏళ్ళ వయస్సున్న గోలీ ఇప్పటి వరకు 11 ఏళ్ళకు పైగా కటకటాల్లోనే గడిపాడు. ఓ వాహనచోరీ కేసుకు సంబంధించి గత ఏడాది అక్టోబర్‌లో దుండిగల్‌ పోలీసులకు చిక్కాడు. 20 రోజుల క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన ఇతగాడు మళ్ళీ చోరీలు ప్రారంభించాడు. రాత్రి వేళల్లో నిర్మానుష్య కాలనీల్లో రెక్కీ చేసే ఇతగాడు అదును చూసుకుని వాహనాలను తస్కరిస్తున్నాడు. గత నెల్లో ఆదిభట్ల పరిధి నుంచి ఓ వాహనం తస్కరించిన గోలీ దానిపై కొన్ని రోజులు సంచరించాడు. మద్యం మత్తులో వాహనం నడుపుతూ మహంకాళి పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఆ వాహనాన్ని వారి వద్దే వదిలేసిన  వనస్థలిపురం నుంచి మరో వాహనాన్ని చోరీ చేసి వినియోగిస్తున్నాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్‌ఐలు మహ్మద్‌ ముజఫర్‌ అలీ, పి.మల్లికార్జున్, ఎన్‌.రంజిత్‌కుమార్‌లతో కూడిన బృందం వలపన్ని పట్టుకుంది. ఇతడి వద్ద ఉన్న వాహనంతో పాటు వెల్లడించిన వివరాల ఆధారంగా మహంకాళి ట్రాఫిక్‌ పోలీసుల వద్ద ఉన్నదీ రికవరీ చేసింది. తదుపరి చర్యల నిమిత్తం వాహనాలతో సహా నిందితుడిని ఆదిభట్ల పోలీసులకు అప్పగించింది.

మరిన్ని వార్తలు