క్యాబ్‌ డ్రైవర్లే టార్గెట్‌!

20 Jun, 2020 11:49 IST|Sakshi

దృష్టి మళ్లించి సెల్‌ఫోన్లు చోరీ

ఓ బంగారం వ్యాపారికీ టోకరా

టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన నిందితుడు

సాక్షి, సిటీబ్యూరో: క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తూ వారినే టార్గెట్‌గా చేసుకుని దృష్టి మళ్లించి సెల్‌ఫోన్‌ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని ఉత్తర మండల టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతగాడు ఓ బంగారం వ్యాపారికీ టోకరా వేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌ రావు శుక్రవారం వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ నగరంలోని వారాసిగూడ ప్రాంతంలో నివసిస్తున్నాడు. కొన్నాళ్ల పాటు జనరల్‌ బజార్‌లో బంగారు నగల తయారీ, ముత్యాలకు పాలిష్‌ పెట్టే పని చేశాడు. అయితే అవసరమైన స్థాయిలో పని, ఆదాయం లేకపోవడంతో క్యాబ్‌ డ్రైవర్‌గా మారాడు. ఇలా వచ్చే సంపాదనతోనూ తృప్తి పడని రెహ్మాన్‌ క్యాబ్‌ డ్రైవర్లనే టార్గెట్‌గా చేసుకుని దృష్టి మళ్లిచి నేరాలు చేయాలని పథకం వేశాడు. ప్రయాణికుడి మాదిరిగా క్యాబ్‌ బుక్‌ చేసుకునే ఇతగాడు పికప్‌ పాయింట్‌లో వాహనం ఎక్కేవాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత తన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయిందని, అర్జంట్‌గా తన తల్లిదండ్రులతో మాట్లాడాలని డ్రైవర్‌తో చెప్పేవాడు. ఆ నెపంతో డ్రైవర్‌ నుంచి సెల్‌ఫోన్‌ తీసుకుని కాల్‌ చేసి మాట్లాడుతున్నట్లు నటించేవాడు. ఓ ప్రాంతంలో కారు ఆపమని చెప్పి అదును చూసుకుని ఫోన్‌తో సహా ఉడాయించేవాడు.

ఈ పంథాలో ఈ నెలలోనే మహంకాళి, రామ్‌గోపాల్‌పేట, గోపాలపురం పరిధిల్లో మూడు నేరాలు చేశాడు. గత శనివారం జనరల్‌ బజార్‌లో ఓ జ్యువెలరీ దుకాణానికి వెళ్లిన రెహ్మాన్‌ అక్కడ రూ.లక్ష విలువ చేసే నగలు ఖరీదు చేశాడు. రూ.21 వేలు చెల్లించిన ఇతగాడు మిగిలిన మొత్తం తనతో మనిషిని పంపిస్తే ఇస్తానంటూ నమ్మించాడు. జ్యువెలరీ దుకాణం నిర్వాహకులు అలానే చేయగా... ఆ మనిషి బైక్‌పై రెహ్మాన్‌ తన ఇంటి వరకు వెళ్ళాడు. అక్కడ అతడిని వేచి ఉండమని చెప్పిన ఇతగాడు నగలు తీసుకుని ఉడాయించాడు. దీనిపై మహంకాళి ఠాణాలో మరో కేసు నమోదైంది. దీన్ని ఛేదించడానికి ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్‌లతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. జనరల్‌ బజార్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలించిన పోలీసులు రెహ్మాన్‌ నిందితుడిగా గుర్తించారు. శుక్రవారం ఇతడిని పట్టుకుని 18.56 గ్రాముల బంగారు నగలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో మిగిలిన మూడు నేరాలు సైతం అంగీకరించాడు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడితో సహా సొత్తును మహంకాళి పోలీసులకు అప్పగించారు. ఇతడిపై గతంలో చిలకలగూడలో ఓ చోరీ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు