బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్తూ..

22 Sep, 2018 13:25 IST|Sakshi
ప్రమాదంలో గాయపడిన మహిళలు, ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు,(ఇన్‌సెట్‌లో)  బాబు (ఫైల్‌)

‘వద్దు బిడ్డా.. ఒక్కగానొక్క కొడుకువు దూరదేశం పోవద్దు.. ఉన్న ఊరు.. కన్నవారి కళ్లముందు చెల్లెళ్లను చూసుకొని ఉండు బిడ్డా’ అని తల్లిదండ్రులు కన్నీరు పెట్టారు. దివ్యాంగుడైన తండ్రి, అమాయక తల్లి, పెరుగుతున్న చెల్లెళ్లు.. పేద కుటుంబానికి ఏకైక దిక్కుగా ఉన్న కుమారుడు కుటుంబ పోషణకు దూరదేశం దుబాయికి వలస కూలిగా పయనమయ్యాడు. అప్పులు చేసి విదేశానికి బయల్దేరి విమానాశ్రయం చేరుకునే మార్గమధ్యలో కారు ప్రమాదంలో తిరిగిరానిలోకాలకు వెళ్లగా, కొడుకును సాగనంపేందుకు తోడుగా వెళ్లిన ఏజెంట్‌తో పాటు తల్లి, కుటుంబ సభ్యులు గాయాలపాలయ్యారు.

కొందుర్గు/బొంరాస్‌పేట : ఉన్న ఊరిలో ఉపాధి లేక పొట్టకూటి కోసం దుబాయి వెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరిన ఓ యువకుడిని మృత్యువు వెంటాడింది. ఆ యువకుడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పడంతో దుర్మరణం చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట్‌ మండలం మదనపల్లి తండాకు చెందిన అంగోతు బాబు(24) ప్రతీ ఏటా దుబాయికి కూలి పనులకు వెళ్లేవాడు. ఆరు నెలల క్రితం ఇండియాకు వచ్చిన బాబును తిరిగి దుబాయ్‌ పంపించేందుకు ఏపీ20ఎం 5522 కారులో తల్లి బుజ్జిబాయి, చిన్నమ్మ హుమ్లీబాయి కుటుంబీకులు లాలు, గణేష్, నేనావత్‌ రాజు, రమేష్‌ శుక్రవారం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి బయల్దేరారు.

కాగా కొందుర్గు మండలం రామచంద్రాపూర్‌ వద్ద ఉదయం 10 గంటల సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటనలో బాబు(24) అక్కడిక్కడే మృతిచెందాడు. మిగిలినవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని 108 సాయంతో షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడి బాబాయి లాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ చెప్పారు.  

పోషించే కొడుకును పోగొట్టుకున్నాం... 
తమకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూలి పనులు చేసి తమను పోషించేవాడని, తమను సాకే కొడుకును పోగొట్టుకొని బతికుండి ఫలితమేంటని తల్లి బుజ్జిబాయి విలపించిన తీరు స్థానికులు కంటతడి పెట్టించింది. ప్రమాదంలో తన ప్రాణాలు పోయినా బాగుండేదని కన్నీరు పెట్టుకుంది.  

స్టీరింగ్‌ పనిచేయకపోవడం వల్లే   
కారు స్టీరింగ్‌ ఫెయిల్‌ కావడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కాగా రోడ్డు పక్కనే మిషన్‌ భగీరథ పైపులైన్‌ కోసం గుంతలు తీయడం వల్ల రోడ్డు ఇబ్బందిగా మారిందని, ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి రోడ్డుపక్కన ఉన్న చెట్టుకు ఢీకొందని మరికొందరి అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా గుంతలు పూడ్చాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు