అన్న కూతురు ప్రేమ నచ్చని ఉన్మాది

13 Oct, 2019 10:26 IST|Sakshi
బాలయ్య, లత, చందన

అన్న కూతురు ప్రేమ పెళ్లిని జీర్ణించుకోలేక దారుణం 

తోడబుట్టిన అన్న, అన్న చిన్నకూతురి హత్య 

సొంత కూతురునూ వదలని కర్కశత్వం 

తన అన్న కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడం అతడికి నచ్చలేదు.. ‘‘మన కాళ్లు మొక్కాల్సిన వాళ్లింటికి మన బిడ్డ వెళ్లడం ఏంటీ? మనం వాళ్ల కాళ్లు మొక్కాల్నా?’’ అంటూ కొంతకాలంగా సోదరుడు కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో ఉన్మాదిగా మారాడు. అన్నను, అతడి కూతురినే కాదు.. తన కూతురును సైతం దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది.

సాక్షి, కామారెడ్డి/దోమకొండ: భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన బందెల బాలయ్య (45), బందెల రవి అన్నదమ్ములు. ఇద్దరూ బ్యాండు మేళం వాయిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. బాలయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు దీప, లత(16), కుమారుడు అజయ్‌ ఉన్నారు. రవికి భార్య, ఒక కూతురు చందన(8) ఉన్నా రు. ప్రస్తుతం రవి భార్య గర్భిణి.. బాలయ్యకు ఆరోగ్యం బాగాలేక ఇటీవల ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో ఆయన భార్య కూలి పనులకు వెళ్తోంది. బాలయ్య పెద్ద కూతురు దీప నెల రోజుల క్రితం జంగంపల్లి గ్రామానికి చెందిన వారి కులానికే చెందిన నర్సింలు అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయంలో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగినా.. ఒకే కులం కావడంతో సర్దుకుపోయారు. బాలయ్య తమ్ముడు రవికి మాత్రం తన అన్న కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చలేదు. వాళ్లు తమ కాళ్లు మొక్కే వారని, వాళ్లింటికి మన అమ్మాయి వెళితే మనం వాళ్ల కాళ్లు ఎలా మొక్కుతామంటూ రవి పలుమార్లు బాలయ్యతో గొడవపడ్డాడు. అన్న కూతురు ప్రేమ వివాహంతో తమ పరువు పొయిందని బాధపడేవాడు. ముఖానికి గుడ్డను అడ్డం కట్టుకుని గ్రామంలో తిరిగేవాడు. అయితే జరిగిందేదో జరిగిపోయిందంటూ బాలయ్య తమ్ముడిని సముదాయించే ప్రయత్నం చేశాడు. అయినా రవి మాత్రం అన్న కూతురు చేసిన పని తనకు నచ్చలేదంటూ బాహాటంగానే చెప్పేవాడు. అన్న కుటుంబ సభ్యులందరినీ చం పుతానంటూ పలుమార్లు హెచ్చరించాడు. దస రా పండుగ రోజు నవ దంపతులను చంపడానికి కూడా ప్రయత్నించినట్లు తెలిసింది.  

పథకం ప్రకారం హత్య 
తన అన్న కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని రవి ఎలాగైనా అన్నను, అన్న కుటుంబ సభ్యులను చంపాలని పథకం పన్నాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మాయ మాటలు చెప్పి, నమ్మించి తన బైకుపై అన్న బాలయ్య, అన్న రెండో కూతురు లత (16), తన కూతురు చందన (8) లను తీసుకుని దోమకొండ మండల కేంద్రానికి సమీపంలోని మల్లన్న ఆలయం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ను గ్లాసుల్లో పోసి ముగ్గురితో తాగించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో అన్న బాలయ్య, అన్న కూతురు లతల గొంతు కోశాడు. ముగ్గురూ చనిపోయాక అక్కడినుంచి పరారయ్యాడు. శనివారం మధ్యాహ్నం మల్లన్న గుడి ప్రాంతానికి వెళ్లిన రైతులకు మృతదేహాలు కనిపించాయి. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మొదటినుంచీ నేరచరిత్రే.. 
నిందితుడు రవిది మొదటి నుంచీ నేర చరిత్రేనని గ్రామస్తులు తెలిపారు. పదేళ్ల క్రితం రవి ఇంటికి సమీపంలో నివాసం ఉండే అదే సామాజిక వర్గానికి చెందిన ఓ కుటుంబంపై మంత్రాల నెపంతో గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో ఓ మహిళ కాలు విరిగిపోయింది. ఆమె భర్తకూ గాయాలయ్యాయి. ఆ కేసులో రవి అరెస్టై కొంతకాలం జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులనే హత్య చేశాడు. 

నిందితుడి కోసం గాలింపు.. 
నిందితుడు రవి తన బైక్‌ను దోమకొండ గుండ్ల చెరువు సమీపంలో వదిలేసి పారిపోయినట్టు స్థానికులు గుర్తించారు. అయితే శనివారం మధ్యాహ్నం రవి గ్రామంవైపు వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఎస్సీ కాలనీ సమీపంలోని పొదల వైపు వెళ్లాడని ప్రచారం జరగడంతో వందలాది మంది కర్రలు చేతపట్టుకుని ఆ ప్రాంతంలో గాలించారు. భిక్కనూరు పోలీసులు కూడా రవి గురించి వెతికినా నిందితుడి ఆచూకీ లభించలేదు. చెరువు సమీపంలో బైక్‌ లభించడంతో రవి ఆత్మహత్య చేసుకున్నాడా లేక పరారీలో ఉన్నాడా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులు, ప్రజలను నమ్మించడానికి బైక్‌ను అక్కడ వదిలి పారిపోయి ఉంటాడని జంగంపల్లివాసులు అభిప్రాయపడుతున్నారు.  

షాక్‌లో దోమకొండవాసులు.. 
దోమకొండ గ్రామ శివారులో ముగ్గురి హత్య సంఘటనతో గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. ప్రతి నిత్యం వందల మంది రైతులు తిరిగే మల్లన్న ఆలయ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో రోజంతా ఈ ఘటనపైనే చర్చించుకున్నారు.

డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ.. 
సంఘటన స్థలం వద్ద డాగ్‌స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. డాగ్‌స్క్వాడ్‌ అక్కడి నుంచి గుండ్ల చెరువు వద్దకు వెళ్లి తిరిగి వచ్చింది. ఎస్పీ శ్వేత, డీఎస్పీ లక్ష్మీనారాయణ, కామారెడ్డి సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, భిక్కనూరు సీఐ రాజశేఖర్, ఎస్సైలు మురళి, శంకర్, రాజేశ్వర్‌గౌడ్‌ సంఘటన స్థలాన్ని వివరాలు సేకరించారు. మృతుడు బాలయ్య భార్య మణెవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామరెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు భిక్కనూరు సీఐ రాజశేఖర్‌ తెలిపారు. 

పాతికేళ్లలో 11 హత్యలు
భిక్కనూరు: 44వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న జంగంపల్లి గ్రామంలో ఇటీవలి కాలంలో జరిగిన సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇక్కడ తరచూ హత్యలు జరుగుతున్నాయి. 25 ఏళ్లలో 11 మంది హత్యకు గమనార్హం. ఇది గ్రామంలో ఆందోళన కలిగిస్తోంది. 1994 సంవత్సరంలో మల్లయ్య, లింగం, సాయిలు అనే ముగ్గురు హత్యకు గురయ్యారు. 1996వ సంవత్సరంలో బాలిక లక్ష్మిపై అత్యాచారం చేసి చంపేశారు. 12 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన దుమాల భూమవ్వను గుర్తుతెలియని వ్యక్తులు గ్రామశివారులో హత్య చేశారు. అదే ఏడాది గ్రామానికి చెందిన చిన్న మల్లవ్వ మాచారెడ్డి గ్రామశివారులో హత్యకు గురైంది. గతేడాది మే 30వ తేదీన గ్రామానికి చెందిన గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అత్తెల్లి రమేష్‌తోపాటు మరోవ్యక్తి ముదాం రాములు హత్యకు గురయ్యారు. తాజాగా శనివారం గ్రామానికి చెందిన బాలయ్య, లత, చందనలు హత్యకు గురవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా