కోర్కె తీర్చనందుకే చిదిమేశాడు..

31 Oct, 2018 09:32 IST|Sakshi
హత్యకు గురైన బాలిక శ్రావణి, పక్కన హంతకుడు మహ్మద్‌ సల్మాన్‌

వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ

నిందితుడిని పట్టుకున్న పోలీసులు

హంతకుడు ప్లంబర్‌ మహ్మద్‌ సల్మాన్‌

సాక్షి, సిటీబ్యూరో: పరిచయమైన బాలికపై కన్నేశాడో కామాంధుడు... అదును కోసం ఆమెతో స్నేహం నటించాడు... సహకరిస్తున్నట్లు నాటకాలాడుతూ అవకాశం చిక్కడంతో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు... ఆమెపై అఘాయిత్యానికిప్రయత్నించగా అడ్డుకుంది... దీంతో బండరాళ్లతో మోది దారుణంగా చంపేశాడు... పది రోజుల క్రితం తిరుమలగిరి ఠాణా పరిధిలో చోటు చేసుకున్న శ్రావణి హత్యకేసు వెనుక ఉన్న వాస్తవాలివి. కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు సోమవారం నిందితుడిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. 

తల్లి వద్దకు వెళ్తుండగా పరిచయం...
రాజేంద్రనగర్‌ పరిధిలోని ఉప్పర్‌పల్లికి చెందిన మహ్మద్‌ సల్మాన్‌  ప్లంబర్‌. అతని తల్లిబోయిన్‌పల్లి మార్కెట్‌ సమీపంలోని అంజయ్యనగర్‌లో ఉంటోంది. తరచుగా తల్లి దగ్గరకు వెళ్లే సల్మాన్‌కు కూలి పనులు చేసుకునే శ్రావణితో (13) పరిచయం ఏర్పడింది. అంజయ్యనగర్‌కే చెందిన శ్రావణి తండ్రి సంతోష్‌ ఎలక్ట్రీషియన్‌. 2001లో యాదగిరిగుట్టకు చెందిన అలివేలును వివాహం చేసుకున్నాడు.వీరికి ముగ్గురు సంతానం. ఆరేళ్ల క్రితం భార్యాభర్తలు విడిపోయారు. ఇద్దరు కుమార్తెలు తల్లి వద్ద ఉంటుండగా... శ్రావణి తండ్రిదగ్గరే ఉంటోంది.  

స్నేహితుడిగా నటించి..
తొలినాళ్లల్లో సల్మాన్‌ శ్రావణితో స్నేహపూర్వకంగా మెలిగాడు. ఆమెపై కన్నేసిన అనతను కొన్నాళ్ల పాటు ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించాడు. తరచుగా అంజయ్యనగర్‌కు వెళ్తూ ఆమెను కలవడం, మాట్లాడటంతో పాటు తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి తీసుకువెళ్లడం మళ్లీ దింపడం చేసేవాడు. దీంతో శ్రావణికి అతడిపై నమ్మకం ఏర్పడింది. ఇదే అదనుగా అతను ఈ నెల 19వ తేదీన పథకం ప్రకారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శ్రావణిని తన వాహనంపై బయటకు తీసుకువెళ్లాడు. మార్గ మధ్యంలో ఆమె గమనించకుండా మద్యం ఖరీదు చేశాడు.  

అత్యాచారానికి యత్నంచి హత్య...
దురుద్దేశంతో ఉన్న సల్మాన్‌ నమ్మకంగా శ్రావణిని వాహనంపై బోయిన్‌పల్లి మార్కెట్‌ సమీపంలో ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. కొద్దిగా మద్యం తాగిన తర్వాత ఆమె వద్ద తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. తన కోరిక తీర్చమని సల్మాన్‌ అడగ్గా  శ్రావణి తిరస్కరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను ఆమెపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. సల్మాన్‌ ప్రవర్తనతో భీతిల్లిన శ్రావణి అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. అయినా వదలని సల్మాన్‌ సమీపంలోని రాళ్లతో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం పారిపోయాడు. హతురాలి తండ్రికి ఈ విషయం మరుసటి రోజున తెలిసింది. ఆయన ఫిర్యాదుతో  పోలీసులు విచారణ చేపట్టి హంతకుడిని అరెస్టు చేశారు. సోమవారం నిందితుడిని  రిమాండ్‌కుతరలించారు. 

మరిన్ని వార్తలు