తమ్ముడి చేతిలో అన్న హతం

9 Apr, 2018 10:34 IST|Sakshi

జోళదరాశిలో ఘటన

ఇంట్లో మృతదేహన్ని పూడ్చి పరారైన నిందితుడు

మూడు రోజులు తర్వాత వెలుగులోకి..

కర్నూలు : జోళదరాశి గ్రామంలో ఓ వ్యక్తి తమ్ముడి చేతిలో హతమైన ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీనివాసరెడ్డి సమాచారం మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎద్దుల ఇసాక్, యోహాన్, కంబగిరి రాముడు అన్నదమ్ములు. యోహాన్‌కు భారతి, రాజు(22), వసంత సంతానం. కంబగిరిరాముడుకు దేవేంద్రకుమార్, శ్రావణ్‌కుమార్‌ సంతానం. పిల్లలు చిన్న వయస్సులో ఉండగానే యోహాన్, ఆయన భార్య దానమ్మ మృతి చెందటంతో కంబగిరిరాముడు తన పిల్లలతోపాటు అన్న పిల్లల పోషణ బాధ్యతను తీసుకున్నాడు. ఆరవ తరగతి వరకు చదువుకున్న రాజు, శ్రావణ్‌కుమార్‌ పేదరికం నేపథ్యంలో చదువుకు స్వస్తి చెప్పి గౌండా పనిచేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. 

రెండేళ్ల క్రితం రాజు పాణ్యం మండలం కౌలూరులో ఉంటున్న అక్క, బావల  వద్దకు వెళ్లి అక్కడే పనిచేసుకునేవాడు. ఏడాది క్రితం కంబగిరి రాముడు అక్కడికి వెళ్లి  రాజును ఇంటికి పిలుచుకొచ్చాడు. అప్పటి  నుంచి రాజు స్వగ్రామంలోనే ఉంటూ గౌండా పనికి వెళుతున్నాడు. మద్యానికి బానిసైన  శ్రావణ్‌కుమార్‌ అన్నతో తరుచూ గొడవ పడేవాడు. ఇటీవల రాజు కొత్త బైక్‌ కొన్నాడు. విషయం తెలుసుకున్న తమ్ముడు గురువారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి బైక్‌ విషయంలో అన్నతో తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డాడు. ఈ ఘర్షణలో పక్కన ఉన్న కట్టెతో అన్న తలపై బలంగా కొట్టడంతో రాజు అక్కడిక్కడే మృతి చెందాడు.   

మృతదేహాన్ని ఇంట్లో పూడ్చి పరారీ
రాజు మృతి  విషయం బయటకు పొక్కకుండా శ్రావణ్‌కుమార్‌ ఇంట్లోనే బండ పరుపు తొలగించి గొయ్యి తీసి మృతదేహాన్ని పూడ్చి ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే పరారయ్యాడు. ఆదివారం ఉదయం అన్నను చంపిన విషయాన్ని నంద్యాలలో ఉంటున్న తల్లి ఇంద్రావతికి నిందితుడు ఫోన్‌ ద్వారా తెలియజేశాడు. భయాందోళనకు గురైన ఆమె వెంటనే విషయాన్ని శివవరంలో ఉన్న బంధువులకు తెలిపింది. వారు జోళదరాశిలోని హతుడి బంధువులకు సమాచారం చేరవేయడంతో తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు ఇసుక కుప్ప కన్పించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆళ్లగడ్డ డీఎస్పీ చక్రవర్తి, కోవెలకుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ మోహన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు
హత్య జరిగిన విషయం పోలీసులకు తెలిసిపోవడంతో నిందితుడు నేరుగా కోవెలకుంట్ల పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. హంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు దారి తీసిన పరిస్థితులపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు