తాగిన మత్తులో స్నేహితున్ని చంపేశారు

3 Jul, 2019 11:28 IST|Sakshi
రాజశేఖర్‌ మృతదేహం

సాక్షి, ఓర్వకల్లు(కర్నూలు) : మద్యంమత్తులో స్నేహితుల దాడిలో గాయపడిన ఓ యువకుడు కోలుకోలేక సోమవారం మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నివేదిక, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంగళవారం హత్య కేసుగా మార్పు చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని భైరాపురం గ్రామానికి చెందిన బొగ్గుల రంగస్వామి కుమారుడు బొగ్గుల రాజశేఖర్‌(29) కర్నూలు నగరంలో ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. రోజూ ఉదయంవెళ్లి సాయంత్రం గ్రామానికి తిరిగి వచ్చేవాడు. ఈ క్రమంలో గత నెల 27న కర్నూలు నుంచి లొద్దిపల్లె మీదుగా భైరాపురానికి వస్తూ మార్గమధ్యంలో రోడ్డు కల్వర్టుపై కూర్చొని మద్యం తాగుతుండగా స్నేహితులు అదే గ్రామానికి చెందిన సిలువ రాజు, డోన్‌ రవి అక్కడకు చేరుకొని రాజశేఖర్‌తో కలిసి మద్యం తాగారు.

తర్వాత రాత్రి 11.00 గంటలకు సిలువ రాజు, డోన్‌ రవి గ్రామానికి చేరుకొని రాజశేఖర్‌ అతిగా మద్యం తాగి బ్రిడ్జి నుంచి కిందపడ్డాడని అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు హుటాహుటిన అక్కడకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడివుండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య సేవలు అందిన తర్వాత కాస్త స్పృహలోకి వచ్చి తనపై ముగ్గురు వ్యక్తులు కర్రలతో దాడి చేసినట్లు చెప్పి, సోమవారం మృతిచెందాడు. ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. తలపై బలమైన రక్తగాయం కావడంతో పాటు శరీరంలో మూగ దెబ్బలు తగిలినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడి కావడంతో హత్యకు గురైనట్లు నిర్ధారణ కావడంతో ఎస్‌ఐ  పోస్ట్‌మార్టం నివేదికలను కర్నూలు రూరల్‌ సీఐ పవన్‌ కిశోర్‌కు అందజేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హతుని భార్య రేణుక ఫిర్యాదు మేరకు ఆంజనేయులు, డోన్‌ రవి, సిలువ రాజుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా